హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హిమాచల్ లో 60 మంది మరణించారు. ఉత్తరాఖండ్ లో ఆరుగురు చనిపోయారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఈ భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటి వరకు 66 మంది మృతి చెందారు. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. కాగా.. రానున్న రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ లో, మరో నాలుగు రోజుల్లో ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హిమాచల్ లో 60కి చేరిన మృతుల సంఖ్య
హిమాచల్ ప్రదేశ్ లో ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభమైన వర్షాల వల్ల అత్యధికంగా 60 మంది మరణించారని ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. తాజాగా కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి డెడ్ బాడీలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. సిమ్లాలోని కృష్ణానగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆరు తాత్కాలిక ఇళ్లు సహా ఎనిమిది ఇళ్లు కూలిపోగా, ఒక కబేళం శిథిలాల కింద కూరుకుపోయింది.
కాగా.. ప్రతికూల వాతావరణం కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), ఆర్మీతో పాటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ ఉదయం 6 గంటలకు సమ్మర్ హిల్ వద్ద సహాయక చర్యలను తిరిగి ప్రారంభించాయని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి మీడియాకు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మంగళవారం ఒక సమావేశాన్ని నిర్వహించారు. ప్రాధాన్యత ప్రాతిపదికన పునరుద్ధరణ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి హిమాచల్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్, నీటి సరఫరా పథకాలను త్వరితగతిన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
పాంగ్ డ్యామ్ లో నీటిమట్టం పెరగడంతో కాంగ్రాలోని లోతట్టు ప్రాంతాల్లోని 800 మందికి పైగా ప్రజలను వారి గ్రామాల నుంచి ఖాళీ చేయించినట్లు ముఖ్యమంత్రి బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. ‘‘ డ్యామ్ జలాశయంలో నీటిమట్టం పెరగడంతో తమ గ్రామాలు అగమ్యగోచరంగా మారడంతో పాంగ్ డ్యామ్ సమీపంలోని కాంగ్రా లోతట్టు ప్రాంతాల నుంచి 800 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. మరింత మందిని తరలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ లో 6 మరణాలు..
హిమాచల్ ప్రదేశ్ కు పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ లో వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 6 కు చేరింది. తాజాగా ఈ రాష్ట్రంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏడుగురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలోని ఆరాకోట్ ప్రాంతంలోని ఉప్పొంగిన నది నుంచి నీరు గ్రామాల్లోకి ప్రవేశించడంతో గల్లంతైన మహిళ మృతదేహాన్ని మంగళవారం కనుగొన్నట్లు డెహ్రాడూన్లోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్ తెలిపింది. రిషికేశ్ లోని లక్ష్మణ్ ఝులా ప్రాంతంలో వర్షాధార వాగులో తేజస్విని అనే 14 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది.
సోమవారం నుంచి ఈ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ నెల 19వ తేదీ వరకు ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాలక్రమేణా వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. హరిద్వార్లోని భీమ్గోడా బ్యారేజీ వద్ద గంగానది ఉధృతి తగ్గుముఖం పట్టి 293 మీటర్ల ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే కాస్త తక్కువగా 292.65 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది.
