సారాంశం

Gujarat Rain: గుజ‌రాత్ లో వ‌ర్ష బీభ‌త్సం కొన‌సాగుతోంది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి. జునాగఢ్ నగరంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ధాటికి కార్లు, పశువులు కొట్టుకుపోయాయి. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా అహ్మదాబాద్ విమానాశ్రయం నీట మునిగింది. మోకాలి లోతు నీటిలో ప్ర‌యాణికులు న‌డుస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
 

GujaratRain: గుజరాత్ లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం శనివారం రాత్రి మోకాళ్ల ఎత్తు నీటితో నిండిపోయింది. విమానాశ్రయం వరదల్లో చిక్కుకోవడం, రన్వేలు, టెర్మినల్ ప్రాంతాలు నీట మునిగిన వీడియోలను కాంగ్రెస్ నేతలతో సహా పలువురు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

విమానాశ్రయంలో నీటి ఎద్దడి కారణంగా ప్రయాణీకులు సమయానికి తమ విమానాలకు చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే అధికారులు తమ విమానాల గురించి తమ విమానయాన సంస్థలతో తనిఖీ చేయవలసిందిగా ప్రయాణికులను కోరారు.

అహ్మదాబాద్ విమానాశ్రయ టెర్మినల్ వెలుపల జలమయమైన రహదారికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త దీపక్ ఖత్రి షేర్ చేశారు. బీజేపీ పాల‌న పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 28 ఏళ్ల బీజేపీ పాలన తర్వాత గుజ‌రాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు పరిస్థితి ఇదనీ, ఇది నరేంద్ర మోడీ మోడల్ స్టేట్ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. మరో నెటిజ‌న్ వ‌ర‌ద నీటితో ఉన్న‌ టెర్మినల్ వీడియోను షేర్ చేస్తూ 'ఇది అదానీ నిర్వహణలోని అహ్మదాబాద్ విమానాశ్రయం, గుజరాత్' అని పేర్కొన్నారు.

 

 

కాగా,  జునాగఢ్ నగరంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ధాటికి కార్లు, పశువులు కొట్టుకుపోయాయి. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర-కచ్ జిల్లాల్లో ఆదివారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. గుజరాత్ లోని దక్షిణ, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో శనివారం కురిసిన భారీ వర్షాలతో పట్టణ ప్రాంతాల్లో వరద పరిస్థితి నెలకొందనీ, ఆనకట్టలు, నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో గ్రామాలను ఐసోలేట్ చేసిన‌ట్టు సంబంధిత అధికారులు తెలిపారు.