మానవ తప్పిదమా , విద్రోహమా .. ఒడిషా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ : అశ్విని వైష్ణవ్

యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిషా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరపనుంది.

Railway Board recommends probe into Odisha Train Accident to CBI: ashwini vaishnaw ksp

యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిషా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరపనుంది. రైల్వే బోర్డు సిఫారసు మేరకు ఈ ప్రమాదంపై విచారణ జరపాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీబీఐని కోరారు. సిగ్నల్ మారడం వెనుక కుట్ర వుందని అధికారులు అనుమానిస్తున్నారు. కోరమండల్‌ను కావాలనే లూప్‌లైన్‌లోకి మార్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బహనాగ స్టేషన్ మేనేజర్‌ను కూడా అధికారులు విచారించారు. బహనాగ స్టేషన్ మాస్టర్ రూమ్, సిగ్నలింగ్ రూమ్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు. 

 

 

మరోవైపు.. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అశ్విని వైష్ణవ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రానింగ్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ప్రమాదం సంభవించిందని చెప్పారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను గుర్తించినట్టుగా చెప్పారు. ‘‘ఇది వేరే విషయం. ఇది పాయింట్ మెషీన్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ గురించి. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సమయంలో సంభవించిన మార్పు.. దాని వల్ల ప్రమాదం జరిగింది. సరైన విచారణ తర్వాత ఎవరు చేసారో, ఎలా జరిగిందో తెలుస్తుంది’’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 

ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం ఉదయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ‘‘రైల్వే భద్రతా కమిషనర్ ఈ విషయంపై దర్యాప్తు చేశారు. దానిపై నేను వ్యాఖ్యానించడం సరికాదు. విచారణ నివేదిక రావాలి. కానీ ప్రమాదానికి కారణం గుర్తించబడింది. దానికి కారణమైన వ్యక్తులను గుర్తించారు. వాస్తవానికి ఇప్పుడు మా దృష్టి పునరుద్ధరణపై ఉంది. రెండు ప్రధాన లైన్లు, రెండు లూప్ లైన్లు ఉన్నాయి. పని జరుగుతోంది. మేము ఖచ్చితంగా నిర్దేశించుకున్న లక్ష్యం బుధవారం ఉదయం కంటే ముందే పునరుద్ధరణ పూర్తి చేస్తాం’’ అని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 

కవచ్ పరికరంతో ప్రమాదాన్ని నివారించవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. ‘‘కవచ్‌తో దీనికి సంబంధం లేదు. కారణం మమతా బెనర్జీ నిన్న చెప్పినది కాదు. ఆమెకు ఉన్న అవగాహన ప్రకారం ఆమె చెప్పారు’’ అని అన్నారు. 

ఇక, శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్‌ సమీపంలో మూడు వేర్వేరు ట్రాక్‌లపై బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం.. రైలు ప్రమాదం‌లో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,000 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ ప్రకారం.. ప్రమాద స్థలంలో పునరుద్ధరణ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios