మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాయచూర్‌ పట్టణానికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యంత దారుణంగా చెట్టుకు ఉరేసి హత్య చేయబడింది. ఆమెపై మొదట సామూహిక అత్యాచారం జరిపిన దుండగులు ఆ తర్వాత చెట్టుకు ఉరేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ అమానవీయ ఘటనతో సంబంధమున్నట్లు అనుమానిస్తూ ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఈ అఘాయిత్యంతో వున్న సంబంధంపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాయచూర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదవుతున్న విద్యార్థిని గత వారం రోజులుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో యువతి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులకు ఈనెల 16వ తేదీన  పట్టణ శివారులో చెట్టుకు ఉరేయబడిన స్థితిలో మృతదేహం లభించింది. 

ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఇలా దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసినట్టు పోలీసులు గుర్తించారు.  దుండగులు బాధితురాలికి చిత్రహింసలకు గురిచేసి ఆమెతోనే సూసైడ్‌ నోట్‌ రాయించి, ఆ తర్వాత హతమార్చినట్లు తెలుస్తోంది. సంఘటనా స్ధలంలో లభించిన సూసైడ్‌ నోట్‌ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.