మరో రెండు నెలల్లో భారత్ జోడో రెండో విడత యాత్ర.. గుజరాత్ నుంచి త్రిపుర వరకు రాహుల్ మార్చ్!
భారత్ జోడో రెండో విడత యాత్రకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నది. గుజరాత్ నుంచి త్రిపురకు ఈ యాత్ర సాగాలని, మరో రెండు నెలల్లో ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. వచ్చే ఐదు అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ యాత్రతో కాంగ్రెస్ మరోసారి ఊపు తేవాలని అనుకుంటున్నట్టు తెలుస్తున్నది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ గతేడాది మొదలు పెట్టి ఈ ఏడాది జనవరిలో ముగించిన భారత్ జోడో యాత్రకు విశేష ఆదరణ లభించింది. రాహుల్ గాంధీ యాత్ర సక్సెస్‌ఫుల్ అయింది. ఆ తర్వాతే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాహుల్ యాత్ర కర్ణాటక మీదుగా సాగిన సంగతి తెలిసిందే. అప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య సఖ్యత ఉన్నదనే సంకేతాలను రాహుల్ గాంధీ బలంగా పంపించగలిగారు. త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాతే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో రెండో విడత యాత్రకు కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది.
భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు దక్షణం నుంచి ఉత్తర భారతానికి సాగగా.. రెండో విడత గుజరాత్ నుంచి త్రిపురకు అంటే పశ్చిమం నుంచి తూర్పు వైపుగా సాగనుంది. రెండో విడత యాత్ర సెప్టెంబర్‌లో లేదా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
భారత్ జోడో యాత్ర నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ హెడ్ దిగ్విజయ్ సింగ్ సీరియస్‌గా రెండో విడత యాత్ర కోసం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. రెండో విడత యాత్ర కోసం యాక్షన్ ప్లాన్ ఆయన సారథ్యంలోనే సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగానే పార్టీ కీలక నేతలతో కొన్ని రోజులుగా వరుస భేటీలు జరుపుతున్నారు. అయితే, చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రెండో విడత యాత్ర ప్రారంభ తేదీ, రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదని మరో అగ్ర నేత తెలిపారు.
Also Read: Tomato: డబుల్ సెంచరీ కొట్టిన టమాటా.. మదనపల్లె మార్కెట్‌లో రికార్డు ధర
గుజరాత్‌లోని మహాత్మా గాంధీ స్మారకం వెళ్లి రాహుల్ గాంధీ నివాళి అర్పించి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. దీన్నే రెండో విడత యాత్రకు స్టార్టింగ్ పాయింట్‌గా తీసుకుంటున్నారు. పోర్‌బందర్‌లో రెండో విడత యాత్ర ప్రారంభమై త్రిపురలోని అగర్తలాలో ముగిసేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు.