కెమెరాలు వెంట పెట్టుకొని వరి నాట్లు వేసిన మొదటి రైతు రాహుల్ గాంధీ - బీజేపీ
చుట్టూ కెమెరాలు వెంట పెట్టుకొని పొలాల్లోకి దిగి వరి నాట్లు వేసిన మొదటి రైతు రాహుల్ గాంధే అని బీజేపీ విమర్శించింది. ఆయనను కెమెరా రైతు అంటూ అభివర్ణించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నాట్లు వేస్తున్న వీడియోను ఆ పార్టీ ట్వీట్ చేసింది.
మోకాలి లోతు ఉన్న వరి పొలంలో దిగి రాహుల్ గాంధీ చేసిన కార్యకలాపాలను రికార్డు చేసేందుకు కెమెరా బృందం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియోను బీజేపీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది. ‘‘4-5 కెమెరాలతో వరి నాట్లు వేసిన దేశంలోని మొట్టమొదటి స్వయంకృషి రైతు’’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ‘కెమెరా రైతు రాహుల్ గాంధీ’ అంటూ విమర్శ చేసింది.
బీజేపీ ట్విట్టర్ అకౌంట్ పోస్టు రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన కొన్ని గంటల తరువాత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఆ వీడియోను ట్వీట్టర్ లో షేర్ చేశారు. కాంగ్రెస్ నాయకుడిపై విరుచుకుపడ్డారు. ‘‘వాస్తవంగా యువరాజు నిరాశతో కనిపిస్తున్నారు’’ అంటూ విమర్శలు చేశారు. యువరాజు (రాహుల్ గాంధీ) ఆకస్మిక కోరిక, ఆయన నిస్పృహలు నిజమవ్వడం హాస్యాస్పదంగా ఉందని హిమంత బిశ్వ శర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు.
‘‘వీడియోలో పడాలనే తపనతో మా అన్నదాతల గౌరవానికి భంగం కలిగించకండి. 'రైతు'గా నటించి రైతులను దూషించడం శోచనీయం రాహుల్ గాంధీ. రీల్స్ లేకుండా రియల్ అవ్వండి’’ అని శర్మ పేర్కొన్నారు. కాగా.. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే తన ట్వీట్ లో తిప్పికొట్టారు.