Asianet News TeluguAsianet News Telugu

బీజేపీపై అస్త్రమా? ప్రేమ దుకాణమా? వాజ్‌పేయీ సమాధి వద్ద రాహుల్ గాంధీ నివాళి దేనికి సంకేతం?

రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని అటల్ బిహారీ వాజ్‌పేయి సమాధిని సందర్శించి నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల సమాధులకూ ఆయన నివాళి అర్పించారు. భారత్ జోడ్ యాత్రతో ప్రేమను పంచుతున్నా అని చెబుతున్న రాహుల్ గాంధీ ప్రత్యర్థి పార్టీ నేత వాజ్‌పేయికి నివాళి అర్పించడం చర్చనీయాంశమైంది.
 

rahul gandhi visits atal bihari vajpayee memorial.. evokes discussion on hatred or partisan politics
Author
First Published Dec 26, 2022, 2:29 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం దివంగత ప్రధాని, బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి సమాధి వద్దకు వెళ్లి ఆయనకు నివాళి అర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి సమాధి వద్ద పుష్పగుచ్ఛంతో నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల మెమోరియల్స్‌కూ నివాళులు అర్పించారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరిన సంగతి తెలిసిందే. మరో విడత భారత్ జోడో యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభం కానున్నది.

రాహుల్ గాంధీ ప్రత్యర్థి పార్టీ నేతకు నివాళి అర్పించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది బీజేపీపై దాడి చేసి విమర్శించినట్టా? లేక భారత్ జోడో యాత్రలో ఆయన చేసిన పాపులర్ కామెంట్ ‘నఫ్రత్ కే బాజార్ మే మొహబ్బత్ కి దుకున్ ఖుల్ రహా హూ (విద్వేషపు సంతలో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నా)’కు కొనసాగింపేనా? అనే చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ చర్యకు కాంగ్రెస్ నేతల నుంచీ మద్దతు అందుతున్నా కొందరు మాత్రం ఈ ఐడియాన వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ హిందూ ముస్లిం విభజన ఆధారంగా రాజకీయాలు చేస్తున్నదని, విద్వేషాన్ని చిమ్ముతున్నదని తరుచూ ఆరోపించే రాహుల్ గాంధీ కాంగ్రెస్ మాత్రం ఐక్యతను, ప్రేమను పంచడంలో ఉన్నదని చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్ భిన్నమైన పార్టీ అని, ప్రత్యర్థులనూ గౌరవిస్తుందని, ప్రేమిస్తుందని చెప్పడంలో భాగంగానే రాహుల్ గాంధీ ఈ పని చేశాడని, ఈ సంకేతమా స్పష్టంగా వెళ్లాలని చేసినట్టు కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ కేవలం తమ పార్టీ నేతలకే నివాళులు అర్పిస్తూ ఉంటుంది.

రాహుల్ గాంధీ కేవలం అటల్ బిహారీ వాజ్‌పేయికే పరిమితం కాలేదు. ఆయన కుటుంబ సభ్యులు సహా ఇతర నేతలు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల స్మారకాలను సందర్శించారు. బీజేపీ తరహా కాంగ్రెస్ కేవలం తమ పార్టీ నేతలనే స్మరించుకోవడం లేదనే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ చర్యతో వెల్లడించారు. అయితే, ఇది కేవలం ఫొటోల కోసమే చేసిన పని అని బీజేపీ కొట్టిపారేస్తున్నది.

Also Read: దేశమంతా ద్వేషం లేదు.. అది టీవీ చానెళ్లలోనే ఉన్నది.. పాదయాత్రతో స్పష్టమైంది: ఎర్రకోటపై రాహుల్ గాంధీ

సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవెలపింగ్ సొసైటీస్‌లని లోక్‌నీతి కో డైరెక్టర్ సంజయ్ కుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ, ‘చిన్న చిన్న రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా దేశ ఐక్యత కోసం పాటుపడాలనే సందేశాన్ని రాహుల్ గాంధీ తన చర్యతో వెల్లడించారు. పీఎం మోడీ, ఆయన ప్రభుత్వం కేవలం వారి దివంగత నేతలకే నివాళులు అర్పిస్తుందనే విషయాన్ని లేవనెత్తాలని రాహుల్ ప్రయత్నించారు. నెహ్రూ, ఇందిరా గాంధీల సమాధులను ప్రధాని మోడీ సందర్శించలేదు. ఇది మోడీ అనుసరించే పక్షపాత రాజకీయాన్ని సూచిస్తుంది. రాహుల్ గాంధీ అందరి నేతల సమాధులను సందర్శించారు. సంకుచిత రాజకీయ లబ్దికి అతీతంగా ఎదిగాడు’ అని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ గతంలోనూ బీజేపీ సీనియర్ నేతలైన వాజ్‌పేయీ, అడ్వాణీ, జశ్వంత్ సింగ్, వారి కుటుంబాలను ప్రధాని మోడీ అగౌరవపరిచారని, ఇదేనా భారత సంస్కృతిని కాపాడే విధానం అంటూ విమర్శలు చేశారు. ముంబయిలో కాంగ్రెస్ వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ వాజ్‌పేయీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడిందని, కానీ, అతను జబ్బుపడ్డప్పుడు అతడిని మొదట సందర్శించింది కాంగ్రెస్సే అని వివరించారు. ప్రత్యర్థులనూ గౌరవించడమే కాంగ్రెస్ భావజాలం అని పేర్కొన్నారు.

Also Read: మీ విద్వేష బజార్‌లో ప్రేమ దుకాణం తెరవడానికి వచ్చాం.. : బీజేపీ, ఆరెస్సెస్ లపై రాహుల్ గాంధీ ఫైర్

కాంగ్రెస్ నేత అశ్విని కుమార్ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. ఇది ప్రేమపూర్వక రాజకీయాలకు ఆరంభం అని, విద్వేష రాజకీయాలు ముగిసిపోవాలని అభిప్రాయపడ్డారు. 

బీజేపీ ప్రతినిధి కేకే శర్మ మాట్లాడుతూ, వాజ్‌పేయి సమాధిని రాహుల్ సందర్శించడం మంచిదే.. అటల్ జీ ఫస్ట్ స్వయంసేవక్ అని రాహుల్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అటల్ జీ భావజాలం రాష్ట్రధర్మ అని, ఆయన నుంచి రాహుల్ నేర్చుకోవాలని పేర్కొన్నారు. 

కాగా, ఓ రాజకీయ విశ్లేషకుడు దీనిపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కూడా సీనియర్ నేతలు పీవీ నర్సింహ రావు, సీతారాం కేసరి, శరద్ పవార్‌లను అగౌరవపరిచిందని గుర్తు చేశారు. పెద్దలను గౌరవించడం, వాజ్‌పేయిని గౌరవించడం వంటివి వారు ఆశించినస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చు అని చెప్పారు. ఇది కేవలం సోషల్ మీడియా నెరేటివ్ అని, అంతకు మించి మరేదీ కాదని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios