మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో ఆయన పార్లమెంటు సభ్యత్వం ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందనే చర్చ మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలు పార్లమెంటుకు చేరడానికి ఎంత సమయం పడుతుందో చూడాల్సి ఉన్నదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాల్సి ఉన్నది. మోడీ ఇంటి పేరు కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల గరిష్ట శిక్ష విధించగానే 24 గంటల్లోపు పార్లమెంటు సచివాలయం ఆయనను సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీని అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించింది. అయితే, తాజాగా, ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తరుణంలో ఆయన సభ్యత్వాన్ని పార్లమెంటు సచివాయం పునరుద్ధరించడానికి ఎంత సమయం తీసుకుంటుందో చూస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
మల్లికార్జున్ ఖర్గే ఈ అంశంపై మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు లోక్ సభకు చేరడానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాల్సి ఉన్నదని అన్నారు. తాము ఇప్పటికే చాలా సమయం ఎదురుచూశామని వివరించారు. ఇప్పుడు తాము ప్రతీది క్షుణ్ణంగా చూస్తున్నామని చెప్పారు. ఆయనను తిరిగి పార్లమెంటు సభ్యుడిగా పునరుద్ధరించడానికి ఎంత సమయం పడుతుందో చూస్తున్నామని అన్నారు.
నిబంధనల ప్రకారం, తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని రాహుల్ గాంధీ పార్లమెంటు సచివాలయానికి సుప్రీంకోర్టు ఆదేశాలను జత పరిచి లేఖ పంపించాల్సి ఉంటుంది. ఆ లేఖను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సచివాయం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందనేది నేడు ఆసక్తికరంగా మారింది.
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ మొదలు కానుంది. తీర్మానంపై ఓటేయడానికి ప్రభుత్వంపై తమ ఆందోళనలు, అనుమానాలు వ్యక్తం చేయడానికి రాహుల్ గాంధీకి అవకాశం లభించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అది, పార్లమెంటు సచివాలయం తీసుకునే నిర్ణయ గడువుపై ఆధారపడి ఉండనుంది.
కాగా, మరికొందరు నిపుణులు మాత్రం సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతోనే ఆయన తిరిగి ఎంపీగా అయినట్టేనని చెబుతున్నారు. సుప్రీంకోర్టు స్టేతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగిపోతుందని, ఆయన ఎంపీ అయినట్టేనని లోక్ సభ మాజీ సెక్రెటరీ జనరల్ పీడీటీ ఆచారి తెలిపారు.
