National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. సోమవారం నాలుగో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు.
National Herald case: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఐదో సారి జూన్ 21న విచారణలో పాల్గొనాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. ఇక.. నాలుగో రోజు ఈడీ విచారణకు నేడు( సోమవారం) రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇప్పటివరకు రాహుల్‌ను 30 గంటల పాటు ఈడీ అధికారులు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఆందోళనలతో ఈడీ కార్యాలయం, జంతర్‌మంతర్ దగ్గర పోలీస్ భద్రతను పెంచారు. సోమవారం ఏఐసీసీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. కార్యకర్తలను ఏఐసీసీ ఆఫీస్‌లోకి పోలీసులు అనుమతించలేదు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద మంగళవారం మళ్లీ విచారణలో పాల్గొని వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా ఆయనను కోరినట్లు అధికారులు తెలిపారు.
జూన్ 13న మొదటిసారిగా రాహుల్ గాంధీ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఏజెన్సీ ముందు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఆయనను 38 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తున్న యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణ జరుపుతోంది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.
ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులోనే విచారణకు హాజరు కావాలని సమన్లు అందుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చినప్పటీకి .. మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సోనియాకు సూచించినట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను సోమవారం కలుసుకుంది.ఈ మేరకు రాష్ట్రపతికి లేఖలు ఇచ్చారు. ఈ సమయంలో మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌పై ఈడీవి తప్పుడు చేస్తుందనీ, ప్రశాంత వాతావరణంలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ నేతలను గంటల తరబడి పీఎస్‌లలో నిర్బంధిస్తున్నారని ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో జైరాం రమేష్, మల్లిఖర్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్, చిదంబరం, అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు.
