హింస చెలరేగుతున్న మణిపూర్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం ఇంఫాల్‌లో దిగారు. అక్కడి నుంచి చురాచాంద్‌పూర్‌కు వెళ్లుతుండగా పోలీసులు బిష్ణుపూర్ వద్ద ఆపేశారు. రాహుల్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో కాన్వాయ్ వెనుదిరిగింది.
న్యూఢిల్లీ: హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు పర్యటన చేయడానికి వెళ్లారు. ఉదయమే ఇంఫాల్‌లో ల్యాండ్ అయిన ఆయన హింసాకాండకు కేంద్రంగా ఉన్న చురాచాంద్‌పూర్ వైపు బయల్దేరారు. కానీ, పోలీసులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ముందుకు వెళ్లే అవకాశమే ఇవ్వలేదు. దీంతో రాహుల్ గాంధీ కాన్వాయ్ మణిపూర్‌కు వెనుదిరిగింది. ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
రెండు రోజుల పర్యటన కోసం రాహుల్ గాంధీ బయల్దేరి వెళ్లారు. గురువారం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి చురాచాంద్‌పూర్‌కు వెళ్లి తాత్కాలిక ఆశ్రయాల్లో నివసిస్తున్న బాధితులను ఆయన పరామర్శించాలని అనుకున్నారు. బాధితులకు అండగా నిలవాలనే లక్ష్యంతోనే ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. మే నెల నుంచి జరుగుతున్న ఈ హింస కారణంగా సుమారు 50 వేల మంది దాదాపు 300 ఆశ్రయాల్లో నివసిస్తున్నారు.
కాగా, రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు బిష్ణుపూర్ వద్ద అడ్డుకున్నారు. బిష్ణుపూర్ ఎస్పీ రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను అడ్డుకుని.. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సెక్యూరిటీ గురించి తాము ఆందోళన చెందుతున్నామని వివరించారు. గత రాత్రి కూడా ఇక్కడ నిప్పు పెట్టిన ఉదంతాలు చోటుచేసుకున్నాయని వివరించారు. ఎవరో తమపై దాడి చేయడానికి వస్తున్నారని చురాచాంద్‌పూర్‌లోని వారు అనుకుంటే ప్రమాదం తప్పదని అన్నారు.
Also Read: నా వృషణాలు నొక్కి చంపాలనుకున్నాడు.. వ్యక్తి ఫిర్యాదు.. అలా నొక్కి గాయపరచడం హత్యాయత్నం కాదు: హైకోర్టు
ఈ పరిణామంతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు బిష్ణుపూర్ సమీపంలో అడ్డుకున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమను ఆహ్వానించే స్థితిలో తాము లేమని పోలీసులు చెబుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను స్వాగతిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఆయనకు చేతులు ఊపుతూ ప్రజలు కనిపించారని వివరించారు. రాహుల్ గాంధీ కూడా వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారని చెప్పారు. అసలు తమను పోలీసులు ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని వివరించారు.
