కర్ణాటక హైకోర్టు ఓ కేసు విచారిస్తూ.. వృషణాలను నొక్కి గాయపరచడం హత్యా ప్రయత్నం కిందికి రాదని తెలిపింది. ఒక వేళ చంపాలనే భావిస్తే ఆయుధం వెంటబెట్టుకువచ్చేవాడు కదా.. అని పేర్కొంది. 

కర్ణాటకలోని చిక్కమగళూరులో అవాంఛనీయ ఘటన జరిగింది. గ్రామంలోని ఓ జాతరలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరు మరోకరి వృషణాలను చేతిలోకి తీసుకుని నొక్కేశాడు. ఆయన ప్రాణాలు పోతున్నట్టుగా అరిచేశాడు. తీవ్ర నొప్పితో హాస్పిటల్ వెళ్లగా ఎడమ వృషణాన్ని తొలగించారు. అనంతరం, బాధితుడు తనపై హత్యా ప్రయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడు ఓంకారప్ప ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు నిందితుడు పరమేశ్వరప్పకు ఏడేళ్ల శిక్ష విధించింది. అయితే, పరమేశ్వరప్ప ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఈ కేసు విచారణ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. వృషణాలను నొక్కి గాయపరచడం హత్యాయత్నం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ వ్యక్తికి నిజంగానే చంపేయాలని ఉంటే అందుకు తగ్గట్టుగా ఒక ఆయుధం కూడా వెంట పెట్టుకుని వచ్చేవాడు కదా.. అని హైకోర్టు పేర్కొంది. కేసును హత్యాయత్నం నుంచి ఉద్దేశపూర్వకంగా హానీ తలపెట్టడంగా మార్చింది. ఈ సెక్షన్‌లకు అనుగుణంగా శిక్షనూ మార్చింది.

Also Read: తెలంగాణ పై బీజేపీ ఫోకస్.. 8 నుంచి హోరా హోరీ.. 600 మంది నేతలు రంగంలోకి

ఏడేళ్ల శిక్షను మూడేళ్లకు తగ్గించింది. రూ. 50 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఆ మొత్తం నేరుగా బాధితునికే అందించాలని పేర్కొంది. ఈ ఘటన 2010లో చిక్కమగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. 2012లో ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది.