ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించుకున్నారు. సావర్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నవారిని రాహుల్ గురువారం కౌంటర్ ఇచ్చారు.
ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించుకున్నారు. సావర్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నవారిని రాహుల్ గురువారం కౌంటర్ ఇచ్చారు. సావర్కార్ బ్రిటిషర్లకు క్షమాభిక్ష పిటిషన్లు రాసి పింఛను స్వీకరించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని కొన్ని పత్రాలను చూపెట్టారు. భయం వల్లే సావర్కర్ అలా చేశారని రాహుల్ చెప్పుకొచ్చారు. ‘‘ఆయన బ్రిటిష్ వారికి సహాయం చేశాడని నాకు చాలా స్పష్టంగా తెలుసు’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
‘‘నా వద్ద సావర్కర్ బ్రిటీష్ వారికి రాసిన లేఖతో కూడిన పత్రం ఉంది. అందులో ‘సర్, నేను మీ అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉంటానని వేడుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇది నేను రాసింది కాదు... సావర్కర్ జీ రాశారు. ఈ పత్రాన్ని అందరూ చదవనివ్వండి’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సావర్కర్ బ్రిటీష్ వారికి సహాయం చేశాడని తనకు చాలా స్పష్టత ఉందని.. ఆయన బ్రిటీష్ వారికి లేఖ రాశారని చెప్పారు. రాహుల్ గాంధీ చూపించిన పత్రాల్లోని కొన్ని విభాగాలు నీలం రంగులో హైలైట్ చేయబడ్డాయి.
మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏళ్ల తరబడి జైలులో ఉండగా.. ఇలాంటి లేఖ రాయలేదని రాహుల్ గాంధీ అన్నారు. సావర్కర్ ఈ లేఖపై సంతకం చేశారని చెప్పారు. భయం వల్లే సావర్కర్ ఈ లేఖపై సంతకం చేశారని తాను నమ్ముతున్నానని తెలిపారు. ఈ లేఖను మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చూడాలనుకుంటే ఈ లేఖను చూడవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వివాదం ఇలా మొదలైంది..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం వాషిమ్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీ మాట్లాడుతూ.. గిరిజన నాయకుడు బిర్సా ముండా తమ చిహ్నం అని చెప్పారు. బ్రిటిష్ వాళ్లకు క్షమాభిక్ష పిటిషన్లు రాసి, పింఛను అంగీకరించిన సావర్కర్ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ల చిహ్నం అని అన్నారు. ‘‘రెండు మూడేళ్లు అండమాన్ జైలులో ఉన్నాడు. తర్వాత ఆయన క్షమాభిక్ష పిటిషన్లు రాయడం ప్రారంభించాడు’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. బ్రిటీష్ నుంచి పెన్షన్ తీసుకునేవారని.. వారి కోసం పని చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేసేవారని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాహుల్ గాంధీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. 11 ఏళ్ల పాటు సావర్కర్ లాగా ఎంతమంది కాంగ్రెస్ నేతలు బాధలు పడ్డారో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇంత సుదీర్ఘమైన హింసను ఎదుర్కొన్నప్పటికీ ఆయన స్వాతంత్య్ర గీతాన్ని ఆలపించారని చెప్పారు. ఇక, రాహుల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం నుండి తీవ్రమైన ప్రతిస్పందన వచ్చింది. సావర్కర్‌ను అవమానించిన వారిని మహారాష్ట్ర ప్రజలు సహించరని ఏక్ నాథ్ షిండే అన్నారు.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ బీజేపీ, షిండే వర్గం నేతలకు కౌంటర్‌గా నేడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తాము ఆమోదించడం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. స్వాతంత్ర వీర్ సావర్కర్ పట్ల మాకు అపారమైన గౌరవం, విశ్వాసం ఉన్నాయని.. వాటిని తుడిచివేయలేమని చెప్పారు.
