ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీను నేటి తెల్లవారుజామున కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడున్న చిరు వ్యాపారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆజాద్ పూర్ మండీని ఆకస్మికంగా సందర్శించారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఆయన ఆయన మార్కెట్ కు వచ్చి, అక్కడున్న చిరు వ్యాపారులతో ముచ్చటించారు. తాజా ధరలపై ఆరా తీశారు.మోకాలి గాయానికి చికిత్స తీసుకొని ఢిల్లీకి వచ్చిన రెండు రోజుల తరువాత రాహుల్ గాంధీ మార్కెట్ కు వచ్చారు.
ద్రవ్యోల్బణం వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారుతలో ఆయన మాట్లాడారు. ఇంకా వారి ఇతర సమస్యలను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పంచుకుంది. ఓ వీడియోను పోస్టు చేస్తూ.. ‘‘ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో కూరగాయలు, పండ్ల వ్యాపారులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. వారి సమస్యలు రాహుల్ కు తెలుసు, అర్థం చేసుకున్నారు. భారత్-జోడో ప్రయాణం కొనసాగుతోంది ’’ అని పేర్కొంది.
కొంత కాలం నుంచి రాహుల్ గాంధీ డ్రైవర్లు, రైతులు, మెకానిక్లు వంటి సామాన్యులను కలుసుకుంటున్నారు. గత నెల 8వ తేదీన కూడా హరియాణాలోని సోనిపట్ జిల్లా మదీనా గ్రామంలో ఆయన ఆకస్మికంగా ప్రత్యక్షమైన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైలర్ అయ్యాయి. ఆ సమయంలో ఆయన అక్కడి పొలాల్లోకి వెళ్లి రైతులతో గడిపారు. వరి నాట్లు వేశారు. ట్రాక్టర్ నడిపారు. అక్కడి మహిళలు తెచ్చిన ఆహారాన్ని తిన్నాడు.
ఈ క్రమంలోనే ఆయన ఆజాద్ పూర్ మండీకి వెళ్లారు. రెండు రోజుల కిందట అదే మార్కెట్ లో రామేశ్వర్ అనే చిరు వ్యాపారి కన్నీటి పర్యంతమైన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దానిని రాహుల్ గాంధీ కూడా తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆ వీడియోలో చిరు వ్యాపారి తాను పెరిగిన ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నానని చెప్పుకొచ్చాడు. తాను కూరగాయాలు, ముఖ్యంగా టమాటాలు కొనలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘‘టమాటాలు చాలా ఖరీదైనవి, నా దగ్గర వాటిని కొనేందుకు డబ్బులు లేవు. ఒక వేళ అంత ధర పెట్టి కొన్నా కూడా వాటిని ఏ ధరకు అమ్మాలో మాకు తెలియడం లేదు. మేము కొన్న టమాటాలు వర్షంలో తడిసినా, స్టాక్ కు ఏదైనా జరిగినా తీవ్రంగా నష్టపోతాం’’ అని అన్నారు. ద్రవ్యోల్బణం తనను నిరాశాజనక పరిస్థితిలోకి నెట్టిందని, రోజుకు రూ .100-200 కూడా సంపాదించలేనని వ్యాపారి చెప్పారు. ఈ వీడియో వచ్చిన ఆజాద్ పూర్ మండీ కే రెండు రోజుల తరువాత రాహుల్ గాంధీ వెళ్లారు.
