ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి కొండంత మద్దతు లభించినట్టయింది. ఇప్పటి వరకు ఈ విషయంపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని, ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటేనే ప్రతిపక్ష సమావేశాల్లో పాల్గొంటామని, విపక్ష కూటమిలో చేరుతామని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ దీనిపై స్పష్టత ఇవ్వడంతో రేపు బెంగళూరులో నిర్వహించనున్న విపక్ష కూటమి సమావేశానికి ఆప్ హాజరవుతుందనే చర్చ జరుగుతున్నది.
న్యూఢిల్లీ: రేపు బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల నేతలు ఐక్యత కోసం భేటీ కావాల్సి ఉన్నది. అయితే.. పాట్నా భేటీలోనే ఆప్ ఢిల్లీ ఆర్డినెన్స్ అంశాన్ని బలంగా ప్రస్తావించింది. కాంగ్రెస్ కూడా ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతు తెలిపితేనే ఐక్యత కూటమి సమావేశంలో పాల్గొనడానికి వస్తామని, లేదంటే.. విపక్ష కూటమిపై పునరాలోచిస్తామని స్పష్టం చేసింది. తాజాగా, రెండో సమావేశం బెంగళూరులో రేపు జరగనుంది. కానీ, ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఆప్ పోరాటానికి మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం రాలేదు. కానీ, తాజాగా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఈ చర్చకు తెర దించారు. తాము ఆప్ పోరాటానికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
‘రేపటి సమావేశంలో ఆప్ కూడా పాల్గొంటుందనే భావిస్తున్నాం. ఆర్డినెన్స్ విషయానికి వస్తే తమ వైఖరి స్పష్టంగా ఉన్నది. ఆ ఆర్డినెన్స్‌కు తాము మద్దతిచ్చేది లేదు’ అని చెప్పారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ చెప్పింది. ఈ వ్యాఖ్యలపై ఆప్ స్పందించింది. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంగా వెల్లడించిందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.
Also Read: క్షుద్రపూజలతో తనను చంపుతాడనే అనుమానంతో మాంత్రికుడినే చంపేసిన స్నేహితుడు
ఈ రోజు సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఇప్పుడు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ భేటీలో రేపటి విపక్ష సమావేశానికి ఆప్ హాజరు కావాలనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అదే జరిగితే... రేపు బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించనున్న ప్రతిపక్ష కూటమి సమావేశానికి అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారు.
