Asianet News TeluguAsianet News Telugu

స్మశానంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై హత్యాచారం : న్యాయం జరిగేవరకు అండగా ఉంటాం.. రాహుల్ గాంధీ

బుధవారం ఉదయం రాహుల్ గాంధీ చిన్నారి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘ఆ కుటుంబంతో నేను మాట్లాడాను. వారు కోరుకునేది ఒకటే. తమ బిడ్డకు న్యాయం జరగాలని  ఆరాటపడుతున్నారు. వారికి అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని రాహుల్ హామీ ఇచ్చారు.  

Rahul Gandhi meets family of minor girl raped, killed in Delhi's Nangal
Author
hyderabad, First Published Aug 4, 2021, 11:09 AM IST

ఢిల్లీ : దేశ రాజధానిలో అత్యాచారం హత్యకు గురైన తొమ్మిదేళ్ల దళిత చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ ఘటనలో న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని పాత నంగల్ గ్రామంలోని ఓ స్మశానంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించిన ఓ బాలికను తల్లిదండ్రుల అనుమతి లేకుండా హడావిడిగా దహనం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

తమ బిడ్డపై కాటికాపరి అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రాహుల్ గాంధీ చిన్నారి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘ఆ కుటుంబంతో నేను మాట్లాడాను. వారు కోరుకునేది ఒకటే. తమ బిడ్డకు న్యాయం జరగాలని  ఆరాటపడుతున్నారు. వారికి అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని రాహుల్ హామీ ఇచ్చారు.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా చిన్నారి కుటుంబాన్ని కలవనున్నారు.

ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని గ్రామానికి చెందిన బాధితురాలి కుటుంబం స్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం సమయంలో అక్కడ ఉన్న వాటర్ కూలర్ నుంచి నీళ్లు తెస్తానని తల్లికి చెప్పి వెళ్లిన బాలిక ఎంతకీ తిరిగిరాలేదు. అరగంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్ ఆమె తల్లి వద్దకు వచ్చి బాలిక మరణించినట్లు చెప్పాడు.

అమానుషం : శ్మశానంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాల్చి...

వాటర్ కూలర్ నుంచి నీళ్లు పడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలిందని చెప్పాడు. పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోస్టుమార్టం పేరుతో ఇబ్బంది పెడతారని, అవయవాలు దొంగతనం చేస్తారని చెప్పి హడావుడిగా బాలిక మృతదేహాన్ని దహనం చేయించాడు.

అయితే రాధేశ్యామ్ తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్ చేశారు. తమ బిడ్డపై కాటికాపరి సహా మరికొందరు అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తమ ఇంటి వద్ద న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios