రాహుల్ గాంధీ ఇంకా చిన్నపిల్లాడే.. సరదా కోసమే యాత్రలు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
రాహుల్ గాంధీ ఇంకా చిన్న పిల్లాడే అని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ఆయన సరదా కోసమే యాత్రలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు చేస్తున్న యాత్రల వల్ల దేశానికి ఏ మాత్రం ఉపయోగమూ లేదని విమర్శించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు సరదా కోసమే యాత్రలు చేస్తున్నారని అన్నారు. అసోంలోని గోలాఘాట్ లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి ప్రజలు ఎందుకు మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. దానివల్ల మనకు ఒరిగేదేమీ లేదని చెప్పారు.
‘‘మేము ప్రజల కోసం వికసిత భారత్ సంకల్ప్ యాత్ర చేస్తున్నాం. కానీ రాహుల్ గాంధీ తన ఆనందం కోసం యాత్ర చేస్తున్నారు. దీని వల్ల ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది.? ఆయన యాత్ర సరదా కోసమే తప్ప ఎవరికీ ప్రయోజనం చేకూర్చబోదు.’’ అని కిరణ్ రిజుజు అన్నారు. రాహుల్ గాంధీ వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారని, ఆయన తన జీవితంలో ఎప్పుడూ ప్రయోజనకరమైన పనులు చేయలేదని రిజిజు అన్నారు.
‘‘అతడికి (రాహుల్ గాంధీ) పరిపక్వత లేదు. ఆయన ఇంకా చిన్నపిల్లాడే. వయసు పైబడినా అతడి ఆలోచనలు ఇంకా చిన్నపిల్లాడిలానే ఉన్నాయి. మేము అతన్ని సీరియస్ గా తీసుకోము. కాంగ్రెస్, వామపక్షాలు ఆయనను ప్రోత్సహిస్తున్నాయి. కానీ దేశానికి అది ముఖ్యం కాదు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఎంతో ముఖ్యమైనవి’’అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కీలకమైన 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు మద్దతు కూడగట్టేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర 67 రోజుల పాటు సాగనుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తంగా 15 రాష్ట్రాలు, 110 జిల్లాల గుండా సాగుతుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగియనుంది. అయితే ఈ యాత్ర మొదటి సారి ప్రకటించిన సమయంలో 14 రాష్ట్రాల్లోనే సాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. తాజాగా ఒక రాష్ట్రాన్ని అందులో చేర్చింది. ఈ యాత్ర మర్చి 20వ తేదీన ముగియనుంది.
రాహుల్ గాంధీ మొదటి విడత పాదయాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై కాశ్మీర్ లో ముగిసింది. 136 రోజుల్లో 4,000 కిలో మీటర్లకు పైగా ఆయన నడిచారు. ఈ రెండో విడత యాత్రలో 15 రాష్ట్రాల్లోని 6700 కిలోమీటర్లు సాగుతుంది. అయితే ఈ సారి కాలినడకనే కాకుండా, వాహనాలను కూడా ఉపయోగించనున్నారు. ఈ యాత్ర మొత్తం 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.