Raipur: రాహుల్ గాంధీ ఆధునిక భారత దేశ మహాత్మాగాంధీ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమితేష్ శుక్లా అభివర్ణించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన అమితేష్ శుక్లా మహాత్మాగాంధీకి, రాహుల్ గాంధీకి మధ్య చాలా పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు.
Rahul Gandhi is the Mahatma Gandhi of modern India: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అమితేశ్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. వయనాడ్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ఆధునిక భారత దేశ మహాత్మాగాంధీగా అభివర్ణించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన శుక్లా మహాత్మాగాంధీకి, రాహుల్ గాంధీకి మధ్య చాలా పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు.
వార్తాసంస్థ ఏఎన్ఐతో అమితేశ్ శుక్లా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆధునిక భారత మహాత్మాగాంధీ అని కొనియాడారు. మహాత్మాగాంధీతో ఆయనకు చాలా పోలికలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేయగా, గతంలో మహాత్మాగాంధీ దండి యాత్ర చేశారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని 'రాష్ట్రీయ పుత్ర' (జాతి పుత్రుడు)గా అభివర్ణించారు.
"నేను చాలా బాధ్యతాయుతంగా ఈ ప్రకటన చేశాను. నేను స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందినవాడిని. మహాత్మాగాంధీ గురించి మా నాన్న (శ్యామా చరణ్ శుక్లా, అవిభాజ్య మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి), మామ (కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విద్యాచరణ్ శుక్లా) నుంచి నేను విన్నకొన్ని విషయాల వల్ల.. మహాత్మా గాంధీకి, రాహుల్ గాంధీకి మధ్య చాలా పోలికలు ఉన్నాయని నేను భావిస్తున్నాను" అని తెలిపారు.
అలాగే, మహాత్మాగాంధీ భారత తొలి ప్రధాని కాగలిగేవారు, కానీ ఆయన అలా చేయలేదని ఆయన అన్నారు. అదే విధంగా 2004, 2008లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని తెలిపారు. మహాత్మాగాంధీ 'దండి మార్చ్' సమయంలో అనేక కిలోమీటర్లు కవాతు చేసినట్లే, రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా నడిచి ప్రజలతో మమేకమయ్యారని వెల్లడించారు. సత్యాయుధంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతం చేసిన మహాత్మాగాంధీ మాదిరిగానే రాహుల్ గాంధీ కూడా నిర్భయంగా నిజాలు మాట్లాడుతున్నారని అమితేశ్ శుక్లా అన్నారు.
శుక్లా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఎంపీ సంతోష్ పాండే ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ మానసికంగా, మేధోపరంగా దివాళా తీసిందని విమర్శించారు.
