రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం అతను యూపీ పోలీసులు ఆధీనంలో ఉన్నాడు.
న్యూఢిల్లీ : జీ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ అరెస్ట్ అయ్యారు. అతడిని అతని నివాసంలోనే పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి ఛత్తీస్ గఢ్ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే వారికంటే ముందే ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేసి న్యూస్ యాంకర్ రంజన్ ను తీసుకు వెళ్లారు. అయితే న్యూస్ యాంకర్ రంజన్ ను అరెస్టు చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు ఘజియాబాద్ పోలీసులు సమాచారం ఇవ్వలేదు. ఈ నాటకీయ పరిణామాల మధ్య అతను అరెస్ట్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను యూపీ పోలీసులు ఆధీనంలో ఉన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జీ టీవీ ఛానల్ లో ప్రసిద్ధి చెందిన డీఎన్ఏ షోకి రోహిత్ వ్యాఖ్యతగా వ్యవరిస్తున్నాడు. రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియో న్యూస్ ను తప్పుగా రిపోర్ట్ చేశాడు. ఆ తర్వాత ఛానల్ వెంటనే దాన్ని సరి చేసుకుని క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఆ వీడియోలో రాహుల్గాంధీ ఏం మాట్లాడారంటే.. ఈ వీడియోలో రాహుల్ గాంధీ తన వయనాడ్ కార్యాలయం పై దాడిని ప్రస్తావించారు. ‘ఈ పని చేసిన యువకులు చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అయినా కూడా వారు చిన్న పిల్లలు… క్షమించేయండి’ అని అన్నారు.
అయితే, జీ ఛానల్ మాత్రం.. ఆ వ్యాఖ్యలు.. ఉదయపూర్ లో Kanhaiyalal ను చంపిన వారు చిన్నపిల్లలని, వారిని క్షమించి వదిలేయాలంటూ.. చెబుతున్నట్లుగా వక్రీకరించి సమాచారాన్ని అందించింది. దీంతో ఆ యాంకర్ మీద చత్తీస్గడ్, రాజస్థాన్ లలోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన తర్వాత ఆ చానల్ జర్నలిస్టు ట్విట్టర్లో.. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా తనను ఉత్తరప్రదేశ్ లోని తన నివాసం నుంచి ఛత్తీస్ గఢ్ పోలీసులు ఎలా తీసుకువెడతారని ప్రశ్నించారు.
ఈ విషయం మీద రాయపూర్ పోలీసులు స్పందించారు. సమాచారం ఇవ్వాల్సిన నియమం లేదని.. అయినా ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి తమకు సహకరించాలని రంజన్ కు చెప్పారు. దీంతో చత్తీస్గడ్ పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ బిజెపి నాయకుడు అమిత్ మాల్వియా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. జర్నలిస్టులపై దాడులు నిర్వహించేందుకు ఛత్తీస్ఘడ్ రాజస్థాన్ లను నిర్మొహమాటంగా కాంగ్రెస్ వినియోగించేస్తోందంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాటి అధికార జ్ఞాపకాల మత్తులో కూరుకుపోయి ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందని అన్నారు.
