కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక రామ్‌లీలా మైదానంలో శనివారం భారత్‌ బచావో ర్యాలీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో ప్రసంగించిన కాంగ్రెస్ నేతలు అధికార బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. 

నాపేరు రాహుల్ సావర్కర్ కాదు... రాహుల్ గాంధీ 

తాను నిజాలను  నిర్భయంగా మాట్లాడతానని, నిన్న అన్న మాటకు  ఎన్నటికీ క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. తన పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదని... రాహుల్‌ గాంధీ అంటూ బీజేపీ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. 

ఈ క్రమంలో ‘రేప్‌ ఇన్‌ ఇండియా’ అని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాహుల్‌ స్పష్టం చేశారు. దేశ లౌకిక విధానానికి భంగం కలిగేలా బీజేపీ వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ.. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, రైతు సమస్యలు, లైంగిక దాడులను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఈ ఆందోళన చేపట్టింది. 

ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం తదితరులు పాల్గొన్నారు. 

Also read: వైఎస్ జగన్ దిశ యాక్ట్: కేరళలోనూ అటువంటి చట్టం, శైలజ వెల్లడి

రేప్ ఇన్ ఇండియా అను తాను చేసిన వ్యాఖ్యపైన స్పందిస్తూ, తాను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నిన్న పార్లమెంటులో డిమాండ్‌ చేసిందని, సత్యం మాట్లాడినందుకు తానెందుకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 

ఏదో ఒకరోజు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా జాతిని క్షమాపణ కోరే సమయం వస్తుందని, అందుకోసం కారణాలను తాను చెబుతానని రాహులా అన్నాడు. మోడీ విధానాలతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోందని, పేదల వద్ద దోచుకుని అంబానీ, అదానీలకు ఆయన దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ ఆక్షేపించారు. 

అంబానీ, ఆదానీలకు కాంట్రాక్టులను అప్పగించడంతో బిజీగా ఉన్న మోడీ.. దేశంలో ఉల్లిపాయ రేటు 200రూపాయలైనా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇక జీడీపీ గురించి మాట్లాడుతూ...జీడీపీ వృద్ధి రేటు దారుణంగా పడిపోయిందని,  జీడీపీ వృద్ధి 4 శాతంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

బీజేపీ తన పద్ధతిలో జీడీపీని అంచనా వేసినపుడు మాత్రమే ఈ స్థాయిలో వృద్ధి కనపడుతుందని,  గతంలోలాగా ఇప్పుడు కూడా జీడీపీని కొలిస్తే, వృద్ధి 2.5 శాతానికి పడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  

ఇక అత్యంత వివాదాస్పదమైన పౌరసత్వ చట్టంపై కూడా రాహుల్ మాట్లాడారు. ఇక దేశంలో నేడు వ్యక్తమవుతున్న నిరసనలకు వాళ్లిద్దరే కారణమని అమిత్ షా, మోడీలపై రాహుల్ విరుచుకుపడ్డారు. 

మతాల మధ్య చిచ్చుపెట్టి జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో విభజన విత్తనాలను నాటారని ఆయన వారి వైఖరిని దుయ్యబట్టారు. అసోం, మిజోరాం, మణిపూర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు వెళ్లి చూస్తే...  మోడీ ఆ రాష్ట్రాలను ఎలా నిరసన జ్వాలల్లో తగులబెట్టారో అర్థమవుతుందని అన్నాడు.  

Also read: తెలంగాణలో ఆ నలుగురే శ్రీమంతులు: మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న రేవంత్ రెడ్డి

ఇక మోడీ బ్రాండ్ ప్రమోషన్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు రాహుల్. టీవీలో ఒక యాడ్‌ ముప్పై సెకన్లపాటు కొనసాగాలంటేనే  లక్షల్లో ఖర్చవుతుందని,  అలాంటిది నరేంద్ర మోడీ టీవీలో రోజూ కనిపిస్తున్నారని, ఆ ఖర్చును ఎవరు భరించాలని ఆయన ప్రశ్నించారు. ఇలా యాడ్ల రూపంలో మోడీ ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు.  

దేశాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి ముందుకు రావాలి:సోనియా 

దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాన్నికాపాడుకునేందుకు అందరూ కలిసి పోరాటం చేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

మోడి సర్కారు దేశ ఆర్థి​క వ్యవస్థను సర్వ నాశనం చేసిందని,యువతకు ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైందని ఆమె విమర్శించారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ అని ఎన్నికలవేళ బీజేపీవారు ఇచ్చిన హామీ ఏమైందని సోనియా గాంధీ ప్రశ్నించారు.

పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలబడిపోతున్నా మోడీ-షాలు పట్టించుకోవడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తమకు ఇష్టమొచ్చినట్టుగా వారు పాలన సాగిస్తున్నారని ఆమె వారిపై ధ్వజమెత్తారు. తమకు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చేస్తూ... రాష్ట్రాల హోదాలను మార్చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.