కొజికోడ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ యాక్ట్ ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. మహిళలు, పిల్లల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని కేరళలో కూడా అమలు చేస్తామని ఆ రాష్ట్ర మంత్రి కెకె శైలజ చెప్పారు. 

కేరళలో చట్టాలకు కొదువేమీ లేదని, ఆ చట్టాలను అమలు చేయడంలో అందుకు సంబంధించిన సంస్థలు అమలు చేయడంలో లోపాలున్నాయని ఆమె అన్నారు. 

మహిళలపై హింసను అరికట్టడానికి, హింసకు పాల్పడినవారిని కఠినంగా వేగంగా శిక్షించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ యాక్ట్ ను శాసనసభలో ఆమోదించిన విషయం తెలిసిందే. అత్యాచారం కేసుల్లో 21 రోజుల్లో దోషులకు శిక్ష పడేలా ఆ చట్టం గ్యారంటీ ఇస్తోంది. 

అత్యాచారం కేసుల దర్యాప్తును వారంలోగా పూర్తి చేసి, కోర్టు విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని కొత్త చట్టం తెలియజేస్తోంది. అత్యాచారం కేసుల్లో దోషులకు 21 రోజుల్లో మరణదండన విధించాలని చట్టం నిర్దేశిస్తోంది. 

అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి జిల్లాల్లో కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరమైన పోస్టులు పెడితే రెండు నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు.