భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి సుప్రీంకోర్టుకు మార్చ్ చేపట్టింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది.
భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని… SIR (సర్) పేరిట జరుగుతున్న ఓట్ల చోరీని ఆపాలని డిమాండ్ చేస్తు ఇండి కూటమి సుప్రీంకోర్టుకు మార్చ్ చేపట్టింది. ఇవాళ (అక్టోబర్ 12) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నుంచి బస్సులో బయలుదేరిన ఇండి కూటమి నేతలు.. బారాఖంబా జంక్షన్ దగ్గర దిగి అక్కడి నుంచి సుప్రీంకోర్టు వైపు నడక ప్రారంభించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, విద్యార్థి నాయకురాలు నేహా బోరా తదితరులు ఈ నిరసనలో ముందు వరుసలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీపీఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీలతో పాటు ఇండి కూటమిలోని పార్టీల తరపున అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, యోగేంద్ర యాదవ్ లాంటి కీలక నేతలు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. నేతలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా సుప్రీంకోర్టు పరిసరాలకు చేరుకుంటున్నారు… దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుప్రీంకోర్టు వైపు దూసుకెళ్లకుండా పొలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు చేపట్టారు. ఈ క్రమంలో భారీబంఖా జంక్షన్ నుండి సుప్రీంకోర్టువైపు వెళుతున్న ఇండి కూటమి ర్యాలీని భగవాన్ దాస్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముందుగానే ఏర్పాటుచేసిన బారీకేడ్లను అడ్డుపెట్టారు… దీంతోో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కొందరు నాయకులు బారీకేడ్ల పైకెక్కి నినాదాలు చేశారు.
సుప్రీంకోర్టులో ఇండి కూటమి పిటిషన్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) నేరుగా కలిసి వినతిపత్రం ఇవ్వాలని ఇండియా కూటమి భావించింది. అయితే పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకోవడంతో కోర్టు వద్దకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది... దీంతో తమ లాయర్లతో పిటిషన్ వేయించింది కాంగ్రెస్. సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో కూడా ఈ పిటిషన్ గురించి పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు దేశంలోని యువత, పౌర హక్కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు.. రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా తమతో కలిసి రోడ్లపైకి వచ్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు, బీజేపీ గుండాలు దారుణంగా దాడులకు పాల్పడ్డారని… దీన్ని అస్సలు సహించబోమని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
అనుమతి నిరాకరించిన సీజేఐ
చట్టప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఏ ఫిర్యాదునైనా విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సీజేఐ జస్టిన్ సూర్యకాంత్. ర్యాాలీగా సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రతిపక్ష నేతలను కలిసేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. కోర్టు విచారణలో ఉన్న అంశంపై ప్రతిపక్ష నేతలను ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
గతవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో నాలుగు మార్చ్‌లు జరిగాయి. శుక్రవారం నాడు రాష్ట్రపతిని కలిసి ఇండియా కూటమి నేతలు వినతిపత్రం సమర్పించారు. పార్లమెంట్‌లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. సీజేఐకి వినతిపత్రం ఇవ్వాలనే ప్రతిపాదనను మమతా బెనర్జీ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఎస్ఐఆర్ పిటిషన్ల వంటి అంశాలను కోర్టు విచారిస్తున్న సమయంలో.. ఇలాంటి అసాధారణ భేటీకి కోర్టు ఒప్పుకుంటుందా అని కూటమిలోని కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేశారు. సీజేఐతో భేటీ కావడం చరిత్రలో ఇదే తొలిసారి అని మల్లికార్జున్ ఖర్గే లాంటి నేతలు వ్యాఖ్యానించారు. కానీ నాలుగు కారణాలను చూపుతూ సీజేఐ నిన్న రాత్రి ఈ భేటీకి అనుమతి నిరాకరించారు.
ప్రతిపక్షాలు లేవనెత్తాలనుకుంటున్న అంశాలను తాను కూడా ఉన్న ధర్మాసనం విచారిస్తోందని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కాబట్టి నేతలను ప్రత్యేకంగా కలవడం కరెక్ట్ కాదన్నారు. పరిపాలనాపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను తనకు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, వారు పిటిషన్ వేస్తే వీలైనంత త్వరగా దాన్ని లిస్ట్ చేస్తామని సీజేఐ వివరించారు. ప్రాథమిక హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.


