జమ్మూ కాశ్మీర్ లో పండిట్లు ఆగ్రహానికి లోనయ్యారు. కాశ్మీరీ పండిత్ రాహుల్ భట్ హత్యతో వారంతా ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చారు. నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు చోట్ల ముస్లింలు కూడా వారితో గొంతు కలిపారు. 

36 ఏళ్ల కాశ్మీర్ పండిత్, ప్రభుత్వ ఉద్యోగి రాహుట్ భట్ హత్య నేపథ్యంలో జ‌మ్మూ కాశ్మీర్ లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అక్క‌డ నివ‌సిస్తున్న కాశ్మీరీ పండిట్‌లు త‌మ‌కు భద్రత క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుండి నిరసనలు చేప‌డుతున్నారు. ఆ స‌భ్యులంద‌రూ క‌లిసి తమ ట్రాన్సిట్ క్యాంపులను విడిచిపెట్టి, రోడ్లను దిగ్బంధించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప‌రిపాల‌నలో వారు విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించారు. 

కాశ్మీర్ స‌మ‌స్యకు హ‌నుమాన్ చాలీసా చ‌ద‌వ‌డం, లౌడ్ స్పీక‌ర్ల‌ను తీసేయ‌డం ప‌రిష్కారం కాదు - సంజయ్ రౌత్

రాహుల్ భ‌ట్ హ‌త్య‌తో ఒక్క సారిగా కోపోద్రిక్తులైన కాశ్మీర్ పండిట్లు ఆందోళ‌న చేప‌ట్టి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. ‘‘ ఈ అవమానకరమైన సంఘటనను మేము ఖండిస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇది పునరావాసమా ? వారు మమ్మల్ని చంపుకోవడానికే ఇక్కడకు తీసుకువచ్చారా ? ఇక్కడ భద్రత లేదు ’’ అని ఓ నిర‌స‌నకారుడు రంజన్ జుట్షి అన్నారు.

Scroll to load tweet…

మరో నిరసనకారుడు మాట్లాడుతూ.. ‘‘ మేము ఇక్కడ పని చేస్తున్నాము. మాకు ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. వారు మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు ? మేము చేసిన నేరం ఏమిటో మాకు చెప్పండి ? ఇక్క‌డ అడ్మినిస్ట్రేటివ్ మొత్తం విఫ‌ల‌మైంది. ’’ అని త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తమ భద్రతకు అధికారులు హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ, త‌మ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయని నిరసనకారుడు సంజయ్ ఎన్డీటీవీతో చెప్పారు. ‘‘ పరిస్థితి తీవ్రత ఎలా ఉందో చూడండి. ఒక తహసీల్దార్ కార్యాలయం సురక్షితమైన ప్రదేశంగా ఉంది. అతను (భట్) తన టేబుల్ వద్ద పని చేస్తున్నాడు. అతడి శరీరాన్ని బుల్లెట్లు చీల్చాయి. అతను పాయింట్-బ్లాంక్‌గా కాల్చబడ్డాడు. వ్యవస్థ కుప్పకూలింది, భద్రత కుప్పకూలింది ’’ అని అన్నారు. 

Scroll to load tweet…

బుద్గామ్‌లోని షేఖ్‌పోరాలో జరిగిన నిరసనలో స్థానిక ముస్లింలు కాశ్మీరీ పండిట్‌లతో చేరారు. వారికి నీటిని అందించారు. కాశ్మీర్ పండిట్లకు న్యాయం, భద్రత కావాలని డిమాండ్ చేశారు. కాగా.. జమ్మూ కాశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో కాశ్మీర్ పండిత్ అయిన రాహుల్ భట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఆయ‌న చ‌దూరా ప్రాంతంలోని త‌హసీల్ ఆఫీసులో క్ల‌ర్క్ గా ప‌ని చేస్తున్నారు. అత‌డిపై కాల్ప‌లు జ‌రిగిన వెంటనే స్థానికులు గ‌మ‌నించి హాస్పిటల్ కు త‌ర‌లించారు. అయితే ఆయ‌న చికిత్స పొందుతున్న స‌మ‌యంలోనే ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించారు. గత ఆరు నెలల్లో హత్యకు గురైన మూడో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారు.

కశ్మీర్‌లో లక్షిత హత్యలు అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో బాధితులు ఎక్కువ‌గా ఉద్యోగాల కోసం వచ్చిన వలస కార్మికులు, కాశ్మీర్ పండిట్లే. అక్టోబర్ నెల‌లో మొత్తం ఐదు రోజులు దాడులు జ‌రగ్గా ఏడుగురు పౌరులు మరణించారు, ఇందులో ఒక కాశ్మీరీ పండిట్, ఒక సిక్కు, ఇద్దరు వలస హిందువులు ఉన్నారు.