High-level BJP delegation: రాహుల్ భట్ హత్య నేపథ్యంలో బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయింది. ప్రభుత్వ సిబ్బందిని సురక్షితంగా తరలించాలనీ, వారికి భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది
Jammu and Kashmir: బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆదివారం నాడు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో సమావేశమై తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల భద్రత సమస్యను లేవనెత్తింది. సమావేశం అనంతరం జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించేందుకు నోడల్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని ఎల్‌జీ హామీ ఇచ్చారని తెలిపారు. "కాశ్మీరీ పండిట్‌లను పాకిస్తాన్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న తీరుపై మేము LGతో చర్చించాము. కశ్మీర్‌లోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న అటువంటి ప్రభుత్వ ఉద్యోగులను తప్పనిసరిగా సురక్షిత జోన్‌లకు బదిలీ చేయాలి. వారి భద్రతకు భరోసా ఇచ్చే నోడల్ సెల్‌ను ఏర్పాటు చేస్తానని LG చెప్పారు" రైనా వెల్లడించారు.
కాగా, బుద్గామ్ జిల్లా చదూరాలోని తహసీల్ కార్యాలయంలో కాశ్మీరీ పండిట్ మరియు ఉద్యోగి అయిన రాహుల్ భట్‌ను గురువారం బుద్గామ్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇది లోయలోని కాశ్మీరీ పండిట్ల నిరసనలను ప్రేరేపించింది. రాహుల్ భట్ హత్యపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆయన భార్యకు ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాహుల్ భట్ 2010-11లో వలసదారుల కోసం ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద క్లర్క్ ఉద్యోగం పొందారు.
రాహుల్ భట్ హత్య తర్వాత క్రికెటర్ సురేశ్ రైనా కూడా ప్రధాని మోడీకి వారి రక్షణ గురించి విజ్ఞప్తి చేశారు. "నా కాశ్మీరీ హిందూ సోదరి కష్టాలను వినవలసిందిగా ప్రధానమంత్రి @నరేంద్రమోడీ జీని అభ్యర్థిస్తున్నాను. కాశ్మీర్‌లో ఉగ్రవాద బాధితుల కోసం భారతీయులమైన మనం కలిసి నిలబడాలి. వారిని ఒంటరిగా వదిలిపెట్టలేము. ఆయన వారి డిమాండ్లను వింటారని మరియు వారిని సురక్షితమైన ప్రదేశానికి బదిలీ చేస్తారని ఆశిస్తున్నాను' అని సురేష్ రైనా శనివారం ఓ వీడియోతో పాటు ట్వీట్ చేశారు.
కాగా, ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాశ్మీరీ పండిట్లు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాశ్మీరీ పండిట్ల రక్షణ కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వ సాధారణ వాదనలను నిరూపిస్తున్నట్లు హత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. మన సోదరులైన కాశ్మీరీ పండిట్లపై జరుగుతున్న దాడులు.. జమ్మూకాశ్మీర్ ఆత్మపై జరుగుతున్న దాడులుగా ఆయన అభివర్ణించారు. పార్టీ మైనారిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ కౌల్ నేతృత్వంలోని కాశ్మీరీ పండిట్‌ల ప్రతినిధి బృందంతో మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ ఫరూక్ పై వ్యాఖ్యలు చేశారు.
