కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా భారతదేశంలో అయితే రెక్కాడితే కానీ డొక్కాడని వలస కార్మికుల పరిస్ధితి దారుణంగా తయారైంది.

దీంతో ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్రాంతాలకు కాలి నడకన వెళ్లే ప్రయత్నం చేశారు. వీరి దీనగాథకు చలించిన కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్ల ద్వారా వీరిని స్వస్థలాలకు పంపింది. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రానికి చేరుకున్న వలస కూలీలకు బిహార్ ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేయడం కలకలం రేపుతోంది.

Also Read:రెండు లక్షలకు చేరువలో భారత్.. 24గంటల్లో ...

బీహార్‌కు చెందిన సుమారు 30 లక్షల మంది వివిధ దశల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే 14 రోజుల క్వారంటైన్ ముగిసి ఇళ్లకు చేరగా.. మరికొంతమంది హోం క్వారంటైన్‌లో వున్నారు.

ఈ నేపథ్యంలో అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ కండోమ్‌ల పంపిణీ నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి, ఇళ్లకు చేరుకున్న వలస కూలీలకు కండోమ్‌లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

Also Read:మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. లక్షకు చేరువలో కరోనా కేసులు

కేర్ ఇండియా సంస్థ సహకారంతో ఈ డ్రైవ్ చేపట్టామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8.77 లక్షల మంది క్వారంటైన్‌ ముగించుకుని ఇళ్లకు వెళ్లారని, మరో 13 లక్షల మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారని చెప్పారు. బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.

అవాంఛిత గర్భదారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు కూలీలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమం అని కోవిడ్ 19తో ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారిగా జనాభాను నియంత్రించడం తమ బాధ్యతన్నారు.