దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కాగా.. దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదుకావడం గమనార్హం. రాజధాని ముంబై సహా అనేక ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. తాజాగా 2,361 కేసులతో మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70 వేలకు దాటింది. మరి కొద్ది రోజుల్లో లక్షకు చేరువైనా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మహారాష్ట్రలో మొత్తం కేసులు 70,013లకు చేరాయని సోమవారం సాయంత్రం ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక తాజాగా 76 మరణాలతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 2,362కు చేరింది. మరణాల్లో సైతం మహారాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది.

కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 37,543 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్-19 బారిన బాధితుల్లో 30,108 మంది కోలుకున్నారు. సోమవారం ఒక్కరోజే 779 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్-19 టెస్టులు బాగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4,71,473 టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కేసుల సంఖ్య 40 వేల మార్కును దాటి 41,099కి చేరాయి. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 60 శాతం కేసులు ఒక్క ముంబైలోనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే నగరంలో 1,413 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ముంబైలో 22,789 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు 20వేలు దాటేశాయి.