ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన గర్బిణి.. కానీ కొన్ని గంటల్లోనే తీరని విషాదం..!!
జమ్మూ కాశ్మీర్‌లో ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
జమ్మూ కాశ్మీర్‌లో ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అందులో ముగ్గురు మూడు మగ శిశువులు, ఒక ఆడ శిశువు ఉన్నారు. అయితే ఆ నలుగురు శిశువులు గంటల వ్యవధిలోనే చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు.. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలోని ప్రభుత్వ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో కలీదా బేగం సాధారణ ప్రసవం ద్వారా సోమవారం తెల్లవారుజామున 2.00 గంటలకు నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో మహిళ ముగ్గురు మగపిల్లలు, ఒక అమ్మాయి ఉంది. అయితే ఆ పిల్లలు నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టినట్టుగా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
అయితే ఈరోజు తెల్లవారుజామున, కుప్వారా ఆసుపత్రిలో నలుగురు శిశువులలో ముగ్గురు మరణించారు. ఆ వెంటనే బతికి ఉన్న మగ శిశువు, తల్లిని ప్రత్యేక సంరక్షణ కోసం శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీనగర్‌కు తరలించగా.. నాలుగో శిశువు కూడా మృతి చెందాడు. కలీదా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక, నెలలు నిండకుండా, తక్కువ బరువుతో జన్మించిన పిల్లలను రక్షించేందుకు అవసరమైన సదుపాయాలు కుప్వారా ఉప-జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో లేవని అంటున్నారు.
ఇక, ఆదివారం సాయంత్రం నియంత్రణ రేఖకు కుడివైపున ఉన్న గ్రామమైన కేరాన్‌లోని వైద్య సదుపాయంలో కలిదా బేగం మొదట చేరినట్లు కొందరు అధికారులు తెలిపారు. అక్కడి ఆరోగ్య కార్యకర్త ఆమెను కుప్వారాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె బిడ్డలను ప్రసవించింది. అయితే కొన్ని గంటల్లోనే నలుగురు శిశువులు కూడా మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.