వీకే సింగ్ ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడే పీవోకేను భారత్ లో విలీనం చేయాల్సింది.. ఇప్పుడెలా చేయగలరు ? - సంజయ్ రౌత్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో విలీనం అవుతుందని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెపుతున్నారని శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కానీ ఆయన ఆర్మీ చీఫ్ గా ఉన్న సమయంలోనే ఆ పని చేసి ఉండాల్సి ఉందని తెలిపారు.

త్వరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో విలీనమవుతుందని భారత ఆర్మీ మాజీ చీఫ్, ప్రస్తుత కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడే పీవోకేను భారత్ లో విలీనం చేసేందుకు ప్రయత్నించి ఉండాల్సిందని అన్నారు. కానీ పదవిలో నుంచి దిగిపోయిన తరువాత ఇప్పుడు ఆయన ఎలా చేయగలరని ప్రశ్నించారు.
సంజయ్ రౌత్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మంగళవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అఖండ భారత్ రావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాం. పీఓకే మనదే అని ఎప్పుడూ చెబుతుంటాం. కానీ మాజీ ఆర్మీ చీఫ్ ఆ పదవిలో ఉన్నప్పుడు దాన్ని మనదిగా చేయడానికి ప్రయత్నించి ఉండాల్సింది. ఇప్పుడెలా చెయ్యగలరు?’’ అని సంజయ్ రౌత్ అన్నారు. అయితే పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తాము చేసే ఏ ప్రయత్నాన్నైనా తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు.
అయితే అంతకంటే ముందు మణిపూర్ ను శాంతియుతంగా మార్చాలని సంజయ్ రౌత్ అన్నారు. ‘‘చైనా మణిపూర్ చేరుకుంది. చైనా లడ్డాఖ్ లోకి ప్రవేశించింది. మన భూమిని తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను చైనా తన మ్యాప్ లో చూపిస్తోందని రాహుల్ గాంధీ అంటున్నారు. ముందు దానిపై దృష్టి పెట్టండి. ఆ తర్వాత పీఓకే తనంతట తానుగా భారత్ లో విలీనమవుతుంది. అలా జరగడానికి మీ అవసరం లేదు’’ అని అన్నారు.
ఇంతకీ వీకే సింగ్ ఏమన్నారంటే ?
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్న వీకే సింగ్ గతంలో ఆర్మీ చీఫ్ గా పని చేశారు. ఆయన సోమవారం రాజస్థాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా డౌసాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పీఓకేలోని ప్రజలు తమను భారత్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ త్వరలోనే భారత్ లో విలీనం అవుతుందని చెప్పారు. పీఓకే తనంతట తానుగా భారత్ లో విలీనం అవుతుందని స్పష్టం చేశారు. కానీ దాని కోసం భారతీయులు మరి కొంత కాలం వేచి ఉండాలని సూచించారు.