వేగంగా వస్తున్న పూరి-సూరత్ ఎక్స్ ప్రెస్ రైలు ఓ ఏనుగును ఢీ కొట్టి.. అనంతరం పట్టాలు తప్పింది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 02827 నంబరు గల పూరి-సూరత్ ఎక్సుప్రెస్ రైలు హతీబరి, మానేశ్వసర్ రైల్వేస్టేషన్ల మధ్య వెళుతూ ఏనుగును ఢీకొని పట్టాలు తప్పింది. ఈ రైలు ఆరు చక్రాలు పట్టాలు తప్పింది. ఏనుగులున్న హతీబారి ప్రాంతంలో ఈ రైలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పోతుండగా సోమవారం తెల్లవారుజామున 2.04 గంటలకు పట్టాలు తప్పిందని సంబాల్ పూర్ డివిజన్ రైల్వే అధికారులు చెప్పారు. 

రైలు ఇంజిన్ పట్టాలు తప్పిందని సంబాల్ పూర్ డీఆర్ఎం ప్రదీప్ కుమార్ చెప్పారు. ఈ రైలు పట్టాలు తప్పడంతో ఎవరూ గాయపడలేదని, డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవర్లు క్షేమంగా ఉన్నారని రైల్వే డీఆర్ఎం చెప్పారు. ఈ రైలు ఏనుగును ఢీకొనడంతో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చారు. రైల్వే అధికారులు వచ్చి పట్టాలు తప్పిన రైలును పట్టాలెక్కించే పనుల్లో నిమగ్రమయ్యారు.