Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్‌లో వివాదాలకు చెక్ : ఇప్పుడు రాజస్థాన్‌పై ఫోకస్, గెహ్లాట్-పైలట్‌ల మధ్య సయోధ్యకు స్కెచ్

రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ యువ నేత సచిన్ పైలట్ మధ్య వివాదాలను తొలగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడంపై సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ఈనెల 28న కేబినెట్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Punjab Tussle Resolved Rajasthan Cabinet Expansion On Congress Agenda ksp
Author
Jaipur, First Published Jul 25, 2021, 2:48 PM IST

2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలోని అసంతృప్తులను చల్లార్చే పనిలో పడింది కాంగ్రెస్. వివాదాలకు చెక్ పెట్టి నేతల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లుగా యువ నాయకత్వానికి, ఛరిష్మా గల నేతలకు అప్పగిస్తూ వస్తోంది. ఇప్పటికే తెలంగాణతో పాటు పంజాబ్‌లను పీసీసీ ఎంపికను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పంజాబ్‌లో సీఎం అమరీందర్ సింగ్, నవ్ జోత్ సింగ్ సిద్ధూల మధ్య నెలకొన్న ఘర్షణలకు తెరదించింది. పంజాబ్ పీసీసీ చీఫ్ పగ్గాలను సిద్ధూకు అప్పగించి ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చింది. తాజాగా, మరో కీలక రాష్ట్రం రాజస్థాన్‌పై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది.

Also Read:మళ్లీ అలిగిన సచిన్ పైలట్.. హైకమాండ్‌తో అమీతుమీ, రాజస్థాన్‌లో మరో తిరుగుబాటు తప్పదా..?

సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ యువ నేత సచిన్ పైలట్ మధ్య వివాదాలను తొలగించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడంపై సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ఈనెల 28న కేబినెట్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్‌లు.. పీసీసీ సభ్యులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

జులై 28న ఎమ్మెల్యేలంతా జైపూర్‌లోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. ఢిల్లీకి వెళ్లే ముందు సీఎం అశోక్ గెహ్లాట్ తోనూ వారిద్దరూ సమావేశమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే శనివారం సీఎంతో వారిద్దరు భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో గెహ్లాట్, పైలట్ వర్గాలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios