Asianet News TeluguAsianet News Telugu

మరోసారి తెరపైకి పీఎం మోడీ భద్రతా ఉల్లంఘన..! పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు..!!

పీఎం మోడీ భద్రతా ఉల్లంఘన: ప్రధాని మోడీ భద్రత లోపం ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయంలో పంజాబ్‌లోని చాలా మంది ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవచ్చవనే వార్తలు వస్తున్నాయి. విచారణ నివేదిక మేరకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

Punjab Top Cops To Face Action Over PM Modi's Security Breach
Author
First Published Mar 21, 2023, 5:51 AM IST

ప్రధాని మోదీ భద్రతా ఉల్లంఘన: ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం చాలా కఠినంగా తీసుకుంటుంది. అప్పటి డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ, ఫిరోజ్‌పూర్ డీఐజీ ఇంద్రబీర్ సింగ్, ఎస్ఎస్పీ హర్మన్‌దీప్ హన్స్‌లపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో పాటు పంజాబ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులపై కూడా ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోనున్నారు. అప్పటి లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ నరేష్ అరోరా, సైబర్ క్రైమ్ ఏడీజీపీ నాగేశ్వర్ రావు, ఐజీపీ పాటియాలా రేంజ్ ముఖ్వీందర్ సింగ్, ఐజీ కౌంటర్ ఇంటెలిజెన్స్ రాకేష్ అగర్వాల్,  డీఐజీ ఫరీద్‌కోట్ సూర్జిత్ సింగ్, ఎస్ఎస్పీ మోగా చరణ్‌జిత్ సింగ్‌లపై కూడా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ అధికారులు తమ స్పందనలను సమర్పించాల్సిందిగా కోరనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

నివేదికలో ఏముంది?

ప్రధానమంత్రి భద్రతలో లోపంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమర్పించిన విచారణ నివేదికలో..ప్రధానమంత్రి భద్రతలో లోపానికి అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిరుధ్ తివారీ, పోలీసు చీఫ్ ఎస్ ఛటోపాధ్యాయ,ఇతర ఉన్నతాధికారులను బాధ్యులుగా పేర్కొంది. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పంజాబ్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ జంజువాను చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని కోరారు.

పంజాబ్ పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణ కమిటీ ఆరోపించింది. ఈ ఘటనలో ప్రణాళిక, సమన్వయంలో ఘోరంగా వైఫల్యమయ్యారని నివేదించింది. పంజాబ్‌లో ప్రధాని మోదీకి భద్రత విషయంలో పలు లోపభూయిష్టమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని నివేదిక పేర్కొంది. పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఖరిని తప్పుబట్టింది.  

అసలేం జరిగిందంటే..? 

ప్రధాని నరేంద్ర మోదీ 5 జనవరి 2022న పంజాబ్‌లో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో ఫిరోజ్‌పూర్‌లో సమీపంలో నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాని మోడీ కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై చిక్కుకుంది.ఆ తర్వాత ప్రధాని ర్యాలీతో సహా ఏ కార్యక్రమానికి హాజరుకాకుండా పంజాబ్ నుండి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పంజాబ్‌ ప్రధాన కార్యదర్శికి గత నెలలో లేఖ రాశారు. కొన్ని రోజుల క్రితం పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీకే జంజువా మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను కేంద్రానికి పంపుతుందని చెప్పారు. తప్పు చేసిన అధికారులకు పెనాల్టీలో ఇంక్రిమెంట్లు నిలిపివేయడం, డిమోషన్ చేయడం , ఇంకా సర్వీస్‌లో ఉన్నవారిని తొలగించడం వంటివి ఉంటాయని ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఏదిఏమైనా.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ప్రధాని మోడీ భద్రతా ఉల్లంఘన అంశం పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది.

Follow Us:
Download App:
  • android
  • ios