హమ్మయ్య.. ఎట్టకేలకు పంజాబ్ పోలీసులకు చిక్కిన అమృత్ పాల్ సింగ్.. అస్సాంలోని దిబ్రూగఢ్ కు తరలింపు..
దాదాపు నెల రోజుల నుంచి పంజాబ్ పోలీసులు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. దేశంలో వివిధ ప్రాంతాలు తిరుగుతూ తలదాచుకుంటున్న రాడికల్ బోధకుడు అమృత్ పాల్ సింగ్ ను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు.
పరారీలో ఉన్న ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని పంజాబ్ లోని మోగా రోడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మోగా పోలీసులు ఇంకా వెల్లడింలేదు. అయితే ఆ ఖలిస్తానీ అనుకూల నాయకుడిని అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయని ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదించింది.
త్రివర్ణ పతాకానికి ఘోర అవమానం.. జాతీయ జెండాతో చికెన్ శుభ్రం.. వీడియో వైరల్, నెటిజన్ల ఫైర్..
జాతీయ భద్రతా చట్టం కింద అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు చేశారు. పంజాబ్ పోలీసులు, జాతీయ ఇంటెలిజెన్స్ సంయుక్త కృషితో ఈ అరెస్టు జరిగింది. పరారీలో ఉన్న ఈ రాడికల్ బోధకుడు, ఖలిస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ మరో ఇద్దరు సహాయకులను పంజాబ్ లోని మొహాలీలో ఏప్రిల్ 18న పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో అరెస్టు చేశారు.
ఏప్రిల్ 15న పంజాబ్ పోలీసులు అతడి మరో సన్నిహితుడు జోగా సింగ్ ను ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ లో అరెస్టు చేశారు. పంజాబ్ పోలీసులు, దాని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం నిర్వహించిన ఆపరేషన్ లో ఖలిస్తానీ అనుకూల నాయకుడు, అమృత్ పాల్ సింగ్ మిత్రుడు పాపల్ ప్రీత్ సింగ్ ను ఏప్రిల్ 10న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మార్చి నెలలో అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. దాదాపు నెల రోజుల కిందట పంజాబ్ పోలీసులు 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ పై లుకౌట్ సర్క్యులర్ (ఎల్ వోసీ), నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్ బీడబ్ల్యూ) జారీ చేశారు. అమృత్ పాల్ అనుచరుల్లో ఒకరైన లవ్ ప్రీత్ తూఫాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమృత్ పాల్ మద్దతుదారులు ఫిబ్రవరి 23న అమృత్ సర్ లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే.