ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఆఫీసుల టైమింగ్‌లో మార్పులు ప్రకటించింది. తద్వార విద్యుత్ వినియోగం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు 9 గంటల నుంచి 5 గంటల వరకు పని చేస్తుండగా... భగవంత్ సింగ్ మాన్ మాత్రం ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నడిచేలా కొత్త నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

ఛండీగడ్: ఎండలు ముదురుతున్న తరుణంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ఉద్యోగులు, ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం ఇవ్వడమే కాదు.. విద్యుత్‌ను కూడా ఆదా చేసే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు తెరిచి ఉంటాయని సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు. దేశంలో ఇలాంటి నిర్ణయం ఏ రాష్ట్రమూ తీసుకోలేదని వివరించారు.

ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటలకు తెరుచుకుని మధ్యాహనం 2 గంటల వరకు సేవలు అందిస్తాయని సీఎం అన్నారు. ఈ మార్పు మే 2వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. 

ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు, ప్రజలకు ఉపశమనం లభించనుంది. అంతేకాదు, పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఎస్‌పీసీఎల్) కూడా దాని విద్యుత్ లోడ్ తగ్గించుకోవడానికి ఉపకరిస్తుందని పంజాబ్ సీఎం మాన్ తెలిపారు. మండే ఎండల బారిన పడే ముప్పు తప్పిందని ప్రజలు సంతోషిస్తారని వివరించారు. ఆ ఉద్యోగులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడానికి వీలవుతుందని అన్నారు. దీర్ఘమైన చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

ఈ నిర్ణయం మే 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. మే 1వ తేదీన మేడే ఉన్నదని, అందువల్ల 2వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపారు. 

Also Read: మరోసారి మోడీ Vs స్టాలిన్! వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన.. రాష్ట్రాలకు నిధులివ్వాలన్న స్టాలిన్

పీఎస్‌పీసీఎల్ పీక్ లోడ్ సమయం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తమకు తెలిపినట్టు మాన్ చెప్పారు. ఇలాంటి నిర్ణయాలను యూఎస్, కెనడా వంటి దేశాల్లో అమలు చేస్తున్నారని, కానీ, మన దేశంలో మాత్రం ఇదే తొలిసారి అవుతుందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చాక తాను కూడా ఉదయం 7.30 గంటలకు ఆఫీసులో ఉంటానని సీఎం తెలిపారు.