పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ రోజు హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీ కానున్నారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ రోజు హైదరాబాద్‌కు రానున్నారు. పంజాబ్‌లో పెట్టుబడుల కోసం పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షించేందుకు భగవంత్ మాన్ చెన్నై, హైదరాబాద్‌లలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఇందుకోసం భగవంత్ మాన్ ఆదివారం సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. సోమవారం రోజున చెన్నైలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై భగవంత్ మాన్.. ముఖ్యమైన రంగాలలో పెట్టుబడులు మరియు జాయింట్ వెంచర్‌ల గురించి చర్చించారు. ఇక, మంగళవారం హైదరాబాద్‌కు చేరుకోనున్న భగవంత్ మాన్.. పరిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. హోటల్ తాజ్ కృష్ణాలో ఈ కార్యక్రమం జరగనుంది. పంజాబ్ ప్రభుత్వం ఫిబ్రవరి 23,24 తేదీల్లో మొహాలీలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలకు భగవంత్ మాన్ ఆహ్వానం పంపనున్నారు. 

అయితే హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న భగవంత్ మాన్‌ను బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వెళ్లనున్న భగవంత్ మాన్.. సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి లంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల పరిస్థితులు, దేశ రాజకీయాలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పక్షాలతో సఖ్యత కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక, టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌ మార్చిన తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతగా ఉన్న భగవంత్ మాన్‌తో కేసీఆర్ భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక, ఈ ఏడాది మే నెలలో పంజాబ్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్.. రైతు ఉద్యమంలో మరణించివారి కుటుంబాలతో పాటుగా, గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో అరమలైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లు పాల్గొన్నారు.