కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ వైరస్ లేకుంటే ఈ పాటికి పదో తరగతి పరీక్షలు జరిగిపోయి ఉండేవి. ఇంటర్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి.

కానీ.. కరోనాతో అంతా అతలాకుతలమైంది. అసలు పది పరీక్షలు జరుగుతాయా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ కూడా రాలేదు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే డైరెక్ట్‌గా ప్రమోట్ చేశాయి. అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్వహిస్తామంటున్నాయి. 

ఈ నేపధ్యంలో 5 నుంచి 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రీ-బోర్డు పరీక్షా ఫలితాలు ఆధారంగా 10వ తరగతి విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో మాత్రం గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్ణయాన్ని పాటిస్తామని పంజాబ్ సీఎం స్పష్టం చేశారు.