పూణే: మహారాష్ట్రలోని పూణేలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించిన ఓ మహిళను దుండగుడు చిత్రహింసలకు గురి చేశాడు. తనకు సహకరించలేదనే కోపంతో మహిళ కంట్లోకి ఆయుధాన్ని దించాడు.

పూణేలోని తహసీల్ అనే గ్రామంలో బుధవారం 37 ఏళ్ల వయస్సు గల మహిళ రాత్రి సమయంలో బహిరంగ మలవిసర్జనకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి వచ్చి పట్టుకుని వేరే చోటికి లాక్కెళ్లాడు. 

ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దాన్ని మహిళ బలంగా ప్రతిఘటించింది. దాంతో ఆవేశం పట్టలేక దుండగుడు ఆమె కంట్లో బలమైన ఆయుధంతో పొడిచాడు. నొప్పితో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విని స్థానికులు ఆమెను రక్షించడానికి వచ్చారు. 

వారిని చూసి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వారు చెప్పారు.