ఢిల్లీ మున్సిపల్ కార్యాలయం ఈరోజు రణరంగాన్ని తలపించింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల సందర్భంగా ఓటు వివాదం నేపథ్యంలో ఆప్, బీజేపీ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
దాదాపు పదిహేనేళ్ల పాటు బీజేపీ గుప్పిట్లో వున్న ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఇటీవల ఆప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికకు తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది . అయితే సుప్రీంకోర్ట్ జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం రణరంగమైంది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక సందర్భంగా ఒక ఓటు చెల్లదని మేయర్ ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పాటు ముష్టిఘాతాలతో పిడిగుద్దులు కురిపించుకున్నారు. అరుపులు,కేకలు, గందరగోళం మధ్య ఓ ఆప్ కౌన్సిలర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయను బెంచ్‌పై పడుకోబెట్టారు.
ఎన్నిక సమయంలో ఆప్ మేయర్ నిబంధనలు పాటించడం లేదంటూ బీజేపీ సభ్యులు ఆరోపించారు. ఇంత జరిగినా చెల్లుబాటు కాని ఓటును పరిగణనలోనికి తీసుకోకుండా ఫలితాన్ని ప్రకటిస్తానని మేయర్ స్పష్టం చేశారు. మరోవైపు కౌన్సిలర్ల దాడిలో పలువురు సభ్యులకు గాయాలవ్వగా, కొందరి బట్టలు చిరిగిపోయాయి. ఆప్ నుంచి గెలుపొందిన 250 మంది కౌన్సిలర్లలో 242 మంది ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఇక, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నిక ప్రక్రియ మూడు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అనుమతి మేరకు మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ బుధవారం ఉదయం ప్రారంభమైంది. తొలుత మేయర్ ఎన్నిక జరగగా.. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించారు. ఆ తర్వాత సభ కొద్దిసేపు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభం కాగా.. డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా ఆప్ కైవసం చేసుకుంది. ఆప్‌కి చెందిన ఆలే మొహమ్మద్ ఇక్బాల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నూతన డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత నుంచి స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. అయితే బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సభలో గందగోళ దృశ్యాలు దర్శమిచ్చాయి. ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురు మహిళ సభ్యులు ఒకరినొకరు తోసుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బీజేపీ కౌన్సిలర్లు గాల్లోకి వస్తువులను విసిరేసి తమ సభ్యులపై దాడి చేశారని ఆప్ ఆరోపిస్తుంది.
