Asianet News TeluguAsianet News Telugu

మోడీపై రూ.21 విరాళం వ్యాఖ్యలు : ‘‘ మా మనోభావాలు దెబ్బతీశారు ’’ .. ప్రియాంక గాంధీపై ఆలయ పూజారి ఫైర్

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. భిల్వారా దేవ్‌నారాయణ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విరాళంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలను ఆలయ పూజారి ఖండించారు. 

Pujari of Devnarayan temple in Bhilwara condemns and criticises congress leader Priyanka Gandhi for her lies on PM modis donation ksp
Author
First Published Oct 27, 2023, 5:50 PM IST

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. భిల్వారా దేవ్‌నారాయణ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విరాళంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలను ఆలయ పూజారి ఖండించారు. ఆమె మాటలు దేవ్‌నారాయణ్‌పై విశ్వాసం ఉన్న ప్రజలందరి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ కమిటీ ఎప్పుడూ విరాళాలను వెల్లడించదు లేదా ఏ కవరు ఎవరికి చెందినదో చెప్పదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ సమర్పించిన కవరులో ఆయన రూ.20-21 విరాళం ఇచ్చారని చెప్పడం పూర్తిగా తప్పు అని పూజారి వ్యాఖ్యానించారు.

కాగా.. ఇదే అంశంపై ఈసీ సైతం ప్రియాంక గాంధీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు గాను ఈ నోటీసులు జారీ చేసింది. ప్రియాంకా గాంధీ తప్పుడు ప్రకటనలు చేశారంటూ ఈ నెల 21న కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ .. ప్రియాంకా గాంధీకి నోటీసులు ఇవ్వడంతో పాటు అక్టోబర్ 30 సాయంత్రం లోపు స్పందించాలని కోరింది. 

ఇంతకీ ప్రియాంక గాంధీ ఏమన్నారంటే :

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20న దౌసాలో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఓ ఆలయానికి వచ్చిన మోడీ.. విరాళం ఇచ్చారని, ఆ కవర్‌ను తెరిచి చూస్తే కేవలం రూ.21 మాత్రమే వున్నాయని ప్రియాంక ఆరోపించారు. తాను టీవీలో దీనికి సంబంధించిన వార్తను చూశానని .. ఇది నిజమో కాదో తెలియదని .. అలాగే బీజేపీ ప్రజలకు ఇచ్చే హామీలు కూడా మోడీ చేతిలోని కవర్ లాంటివేనంటూ వ్యాఖ్యానించారు. 

కాగా.. ఈ ఏడాది జనవరి 28న రాజస్థాన్‌లోని భిల్వారాలో వున్న దేవ్ నారాయణ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం .. హుండీలో కానుకలు సమర్పించారు. అయితే ఈ ఆలయ హుండీని ప్రత్యేక సందర్భాల్లోనే ఓపెన్ చేస్తారు. ఈ క్రమంలో భాద్రపద మాసం ఛత్ తిది సందర్భంగా సెప్టెంబర్ 25న హుండీని తెరిచి లెక్కించారు. అందులో మోడీ పేరుతో వున్న కవర్ కనిపించింది. అందులో కేవలం 21 రూపాయాలు మాత్రమే వున్నాయని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios