కరోనా వంటి క్లిష్టకాలంలో కొందరు రాజకీయ నాయకులు తమలో వున్న మానవత్వాన్ని బయటకు తీస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో నిరుపేదలకు నిత్యావసరాలు అందజేయడంతో పాటు నగదు సహాయం చేసిన నేతలు ఎందరో ఉన్నారు.

అయితే ఓ మంత్రి గారు కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో టాయ్‌లెట్ క్లీన్ చేసి శెభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే... పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు.. పుదుచ్చేరిలోని ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పర్యటించారు.

కోవిడ్ రోగులను పరామర్శించిన ఆయన, వసతులు, చికిత్సపై ఆరా తీశారు. ఈ సమయంలో ఆసుపత్రిలో మరుగుదొడ్లు శుభ్రంగా లేవంటూ రోగులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే మంత్రి వాటిని పరిశీలించారు.

అక్కడ శుభ్రత లోపించడంతో కృష్ణారావు స్వయంగా చీపురు పెట్టారు. టాయిలెట్ బ్రష్‌తో మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఇకనైనా పారిశుద్ధ్య కార్మికుల సాయంతో పరిసరాలు క్లీన్ చేయించాలని యాజమాన్యాన్ని మందలించారు.

మరుగుదొడ్లు ఉపయోగించాకా నీళ్లతో శుభ్రం చేసేయాలని, ఎవరో వచ్చి క్లీన్ చేస్తారని వేచి చూడొద్దని కరోనా బాధితులకు కూడా మంత్రి సూచనలు చేశారు.

మరోవైపు కరోనా వేళ పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులు కలిపి సుమారు 458 మంది ఆరోగ్య కార్యకర్తలను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మల్లాడి తెలిపారు.