రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కర్ణాటకలో కాంగ్రెస్ గణనీయమైన మెజారిటీ పై కీలక వ్యాక్యలు చేశారు. అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.

బెంగళూరు : '40% కమీషన్ ప్రభుత్వం' అనే పార్టీ నినాదాన్ని కర్ణాటక ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ శనివారం అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయానికి దూరమవ్వడానికి ఈ అంగీకారం ఒక మలుపుగా ఆయన అభివర్ణించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనప్పటినుంచి కాంగ్రెస్ దూసుకుపోతుండడంతో రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్.. కర్ణాటకలో కాంగ్రెస్ గణనీయమైన మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. అవినీతి, ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్ష పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శనకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. 

కర్ణాటక ఫలితాలు : డికె శివకుమార్ విజయంలో కీలకమైన వ్యూహకర్తలు వీరే...

కర్ణాటక ఓట్ల లెక్కింపు సందర్భంగా పైలట్ ఈ మేరకు కామెంట్ చేశారు. "మేము తీసుకున్న '40% కమీషన్ ప్రభుత్వం' నినాదాన్ని ప్రజలు అంగీకరించారు, ఇది బిజెపిని ఓటమి వైపు నెట్టడానికి కీలకమైన అంశం" అని పైలట్ అన్నారు. సచిన్ పైలట్ గురువారం అజ్మీర్ నుండి జైపూర్ వరకు 125 కిలోమీటర్ల "జన్ సంఘర్ష్ యాత్ర"ను ప్రారంభించారు. ఈ యాత్రకు సచిన్ పైలట్ కు గణనీయమైన మద్దతు లభిస్తోంది. 

224 మంది సభ్యులున్న కర్ణాటక శాసనసభలో 120 సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య శనివారం (మే 13) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నేతల పర్యటనలు రాష్ట్ర ఓటర్ల మీద ప్రభావం చూపలేదని అన్నారు. కర్ణాటకలో మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీని ఓట్ల లెక్కింపు శనివారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లోఅధికార బీజేపీని తోసిరాజని తన పార్టీ దూసుకుపోవడంపై కర్ణాటక మాజీ సీఎం ఈ మేరకు స్పందించారు.

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలు కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని సిద్ధరామయ్య అన్నారు. విలేకరులతో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 120కి పైగా సీట్లు సాధించి గెలుస్తుందని, ఇంకా ప్రారంభ దశ, కౌంటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని, కాబట్టి కాంగ్రెస్ సొంత బలంతో 120కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని అన్నారు. 

“నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా రాష్ట్రానికి ఎన్నిసార్లైనా రావచ్చు. కానీ, అది కర్ణాటక ఓటర్లపై ఎటువంటి ప్రభావం చూపదు ఎందుకంటే ప్రజలు బీజేపీ, వారి అవినీతి, దుష్పరిపాలనతో విసిగిపోయారు. వారివి ప్రజావ్యతిరేక రాజకీయాలు’ అని ఆయన అన్నారు.