కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రయత్నాలు ఫలించి కాంగ్రెస్ విజయదుందుబీ మోగించడంలో కొంతమంది వ్యూహకర్తలు కీలకంగా వ్యవహరించారు.
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మ్యాజిక్ స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ చేసిన కృషి మామూలుది కాదు. రాష్ట్రంలో ప్రజాకర్షక శక్తిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోసింది. ఈ కారణంగానే రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అద్భుత విజయంగా కాంగ్రెస్ తన సొంతం చేసుకుంది.
ఈ విజయం వెనక కొందరు వ్యూహకర్తల చురుకైన ప్రణాళికలున్నాయి. వీరు తమ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వెనకుండి నడిపించారు. అందులో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పనిచేసిన హారికాంత్, సంతోష్ అనే వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు. వీరు ఇప్పటికే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతో గత జీఎచ్ఎంసి ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేశారు. హైదరాబాద్ జిఎచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి పార్టీని ధీటుగా ఎదుర్కోవడంలో వీరు చాలా కీలకంగా వ్యవహరించారు.
కర్ణాటక ఎలక్షన్స్ : ట్విట్టర్ లో ట్రెండింగ్ లో రాహుల్ గాంధీ అన్ స్టాపబుల్ టీజర్...
ఆ సమయంలో హైదరాబాద్ వరదల సహాయంపై జరిగిన రాజకీయం చుట్టూ వీరు ప్రచారం జరిగేలా పక్కా వ్యూహం రచించారు. దీంతో బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ కార్పొరేటర్ స్థానాలు దక్కేలా చేశారు. ఇప్పటికీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు పలు సర్వేలు కూడా వీరే చేస్తుండటం గమనార్హం. ఇప్పుడు వీరే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు స్వతంత్రంగా వ్యూహకర్తలుగా వ్యవహరించారు. సోషల్ మీడియా, రాజకీయ ప్రచార నిర్వహణ చూశారు.
సోషల్ మీడియాలో బిజెపి అభ్యర్థులకు ధీటుగా వాళ్ళ ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ తీసుకున్న క్యాంపెయిన్ లైన్ 40శాతం సర్కార్ అని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. కర్ణాటకలోని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు స్వతంత్రంగా పని చేసి స్థానిక సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చొప్పించారు. వాటిపై స్థానికంగా నిత్యం చర్చ జరిగేలా చేశారు. దీనివల్ల కాంగ్రెస్ అభ్యర్థుల వైపు ప్రజల చూపు మరలేలా పని చేయటంలో విజయం సాధించారు.
మరో వ్యూహకర్త సునీల్ కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేశాడు. సునీల్ కూడా కర్ణాటక కాంగ్రెస్ విజయంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించాడు. కాంగ్రెస్ 40% కమిషన్ సర్కార్ క్యాంపెయిన్ లైన్ తీసుకోవటంలో విజయం సాధించాడు. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్న సునీల్.. రేవంత్ రెడ్డిని ఇక్కడ తన వ్యూహాలతో ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాడు. హరికాంత్, సంతోష్ లు తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా క్యాంపెయిన్ తో పాటుగా పలు సర్వేలు చేస్తూ తెలంగాణ రాజకీయవ్యూహంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
