పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు రెండు నెలలకు పైగా దిగ్బంధానికి గురైన ఢిల్లీలోని షాహీన్‌బాగ్ రహదారి ఎట్టకేలకు తెరచుకుంది. ఢిల్లీలోని జామియా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, హర్యానాలోని ఫరీదాబాద్‌‌లను కలిపే ఈ రహదారిని తెరచినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:పబ్లిక్ రోడ్డును బ్లాక్ చేస్తారా: షాహీన్‌బాగ్ నిరసనలపై సుప్రీం సీరియస్

ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ డీసీపీ మాట్లాడుతూ.. 9వ నెంబర్ రహదారిని నిరసనకారులు తాజాగా పున: ప్రారంభించారు. అయితే వీరి నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ షాహీన్‌బాగ్‌లో గత 70 రోజులుగా స్థానికులు, పలువురు నిరసనకారులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ రహదారిపై నిరసనలు అంతకంతకూ పెరగడంతో ఈ మూడు ప్రధాన రహదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళనల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటుండటంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:నిరసనకు నాలుగేళ్ల బాలుడా: షాహీన్ బాగ్ ఘటనపై సుప్రీం ఆగ్రహం

శాంతియుతంగా నిరసనలు చేసుకోవచ్చునని చెబుతూనే ప్రజలను ఇబ్బందుకు గురిచేయొద్దని సూచించింది. అలాగే వేదికను మరోచోటకి మార్చుకోవాలని సూచించిన కోర్టు.. సీనియర్ న్యాయవాది సంజయ్‌ను మధ్యవర్తిగా నియమించి నిరసనకారులతో చర్చలు జరపాల్సిందిగా ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన ఆందోళనకారులతో చర్చలు జరిపారు.