పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసనలపై కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షాహీన్‌బాగ్‌లో సీఏఏ నిరసనకారులను ఆ ప్రాంతం నుంచి తొలగించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.

ప్రతిరోజు ప్రజలు తిరిగే రహదారిని నిరవధికంగా దిగ్బంధించడం ఏంటని నిరసనకారులను ప్రశ్నించింది. అసలు పబ్లిక్ రోడ్డును ఇన్ని రోజులు ఎలా బ్లాక్ చేస్తారని ధర్మాసనం సూటిగా నిలదీసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Also Read:సీఏఏ ఎఫెక్ట్.. కస్టమర్ ని పోలీసులకు అప్పగించిన ఉబర్ డ్రైవర్

అదే సమయంలో ప్రజలు ప్రతినిత్యం వివిధ అవసరాల కోసం ఉపయోగించే రహదారిని దిగ్బంధించి, వారికి అసౌకర్యం కలిగించొద్దని.. నిరసన తెలిపేందుకు మరో ప్రదేశాన్ని ఎంచుకోవాల్సిందిగా ఆందోళనకారులకు న్యాయస్థానం సూచించింది. 

నిరసనకారుల వాదన వినకుండా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది.

Also Read:నిరసనకు నాలుగేళ్ల బాలుడా: షాహీన్ బాగ్ ఘటనపై సుప్రీం ఆగ్రహం

సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను  నిరసిస్తూ దక్షిణ ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో మహిళలు, చిన్నారులు దాదాపు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ- నోయిడాలను కలిపే ఈ ప్రధాన రహదారిని నిరసనకారులు దిగ్బంధించడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపై బీజేపీ నేతన నందకిశోర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది.