Bengaluru: రిజర్వేషన్ల   నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ య‌డియూర‌ప్ప ఇళ్లు, కార్యాల‌యంపై ఆందోళనకారుల దాడి చేశారు. శివమొగ్గ జిల్లాలో సోమవారం బంజారా, భోవి వర్గాలకు చెందిన వారు చేపట్టిన నిరసనలో క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

Protesters attack BS Yediyurappa's house and office: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అంతర్గత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా శివమొగ్గ జిల్లాలో బంజారా, భోవి వర్గాల సభ్యులు సోమవారం నిర్వహించిన ఆందోళనల సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇల్లు, కార్యాలయంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అడ్డుకున్న‌ పోలీసులు గాయపడటంతో షికారిపూర్ పట్టణంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. యడియూరప్ప ఇళ్లు, ఆఫీసు వద్ద భద్రతను భారీగా పెంచారు. 

మహిళలతో సహా పెద్ద సంఖ్యలో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలతో బ‌ల‌ప్ర‌యోగం చేశారు. లమానీ, లంబానీ అని కూడా పిలువబడే బంజారా సామాజిక వర్గానికి చెందిన నిర‌స‌న కారులు గాయపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గాలకు కేటాయించిన 17 శాతం రిజర్వేషన్లను ఉప వర్గాల వారీగా విభిజించాలని సూచనల క్రమంలో నిరసనలు చెలరేగుతున్నాయి. బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రకటనతో బంజారా సామాజిక వర్గం రిజర్వేషన్ల వాటా తగ్గే ప్రమాదం పొంచివుంద‌ని నిర‌స‌న‌కారులు పేర్కొంటున్నారు.

సదాశివ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన అంతర్గత రిజర్వేషన్లు ఎస్సీ కమ్యూనిటీలోని వివిధ ఉపకులాలకు నిర్దిష్ట కోటాలను కేటాయించాయి. బంజారా సామాజిక వర్గానికి తక్కువ రిజర్వేషన్లు ఇచ్చారని నిరసనకారులు ఆరోపించారు. బొమ్మై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎస్సీ (కుడి) 5.6 శాతం, ఎస్సీ (ఎడమ) 6 శాతం, ఇందులోని ఇతర వర్గాలకు 4.5శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. గతంలో 17 శాతం ఎస్సీ రిజర్వేషన్లలో అధిక వాటా పొందిన బంజారా సామాజికవర్గంపై ఈ చర్య తీవ్ర ప్రభావం చూపింది.