పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలోకి మరింత కుంగిపోతున్న సమయంలో పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్‌ ప్రజల బాధలు ఎన్నో రెట్లు పెరిగాయి. పీవోజేకే, పీవోజీబీ ప్రజలకు కనీసం పిండి, విద్యుత్ కూడా అందే పరిస్థితికి చేరాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్‌ల దైన్యం గురించి అంజాద్ ఆయుబ్ రిపోర్ట్ చేస్తున్నారు. 

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆకలి, నిరుద్యోగంతో ఆవేకావేశాలతో రోడ్డెక్కుతున్నారు. ఒక పట్టణం తర్వాత మరోటి అన్నట్టు ఇప్పుడు పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్, పాక్ ఆక్రమిత గిల్గిత్ బాల్టిస్తాన్‌లు నిరసనలతో ఊగిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలు, వర్క్‌షాపులు మూతపడటంతో వేలాది మంది నిరుద్యోగులయ్యారు. వందలాది కుటుంబాలు ఆకలితో రగిలిపోతున్నాయి. దీంతో మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ నిరవధిక నిరసనలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఖజానా ఖాళీ కావడంతో పెన్షనర్లకు కొన్ని నెలలుగా పింఛన్ డబ్బులు రావడం లేదు. పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌(పీవోజేకే)లో ప్రభుత్వ ఉద్యోగులకూ మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోయిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వంపై వ్యతిరేకతను తొలగించడానికి ఫిబ్రవరి 5వ తేదీని కశ్మీర్ సంఘీభావ దినంగా పాటించి పాకిస్తాన్‌కు మద్దతును కాపాడుకోవాలని ప్రయత్నించారు. కానీ, అది బెడిసికొట్టింది. పలు నగరాల్లో ఆ రోజు నిరసనలు వచ్చాయి. ఆ తర్వాత ఒక నగరం నుంచి మరో నగరానికి దావానలంలా ఆందోళనలు వ్యాపించాయి. భారత అధీనంలోని జమ్ము కశ్మీర్‌లో కశ్మీరీలను ఇండియన్ గవర్న్‌మెంట్ సరిగా చూసుకోవడం లేదని పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు స్వయంగా వారు తిప్పికొట్టారు.

కశ్మీర్ లోయలో పిండి, ఉల్లిగడ్డలు, టమాటలు, ఇతర నిత్యావసరాల ధరలను పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్‌లలోని ధరలతో పోల్చి చూసుకుంటున్నారరు. అక్కడ ప్రతి గ్రామంలో ఈ ధరలపై చర్చ జరుగుతున్నది.

ఆర్థిక సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ ఐఎంఎఫ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ టీమ్ పాకిస్తాన్‌కు విచ్చేసింది. పాక్ ప్రభుత్వంపై పెత్తనం చెలాయిస్తున్నది. మిలిటరీ, ఉద్యోగులకు అలవెన్సులు, ప్రోత్సాహకాలను కోత పెట్టింది. చమురు, విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచాలని ఆజ్ఞాపించింది. జూన్‌లో వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ఐదు నెలల్లో 6 బిలియన్ డాలర్లు వసూలు చేయాలని, మొత్తం సుమారు 16 బిలియన్ డాలర్ల ఫారీన్ ఎక్స్‌చేంజ్ సాధించాలని కండీషన్లు పెట్టింది. అది విదిల్చే 1.3 బిలియన్ డాలర్ల లోన్ కోసం అన్ని రకాల సంస్కరణలకు డిమాండ్ చేస్తున్నది. ఈ లోన్‌ను గతేడాది నవంబర్ నుంచి ఆపుతూ వస్తున్నది.

పీవోజేకే, గిల్గిత్ బాల్టిస్తాన్‌ల నుంచి మిలియన్ డాలర్ల విలువైన లిథియం వంటి అరుదైన ఖనిజాలను పాకిస్తాన్‌లోకి ఎలాంటి లెక్కలు లేకుండానే దోచుకుంటున్నారు. 25 టన్నుల ఒక ట్రక్ లోడ్ లిథిమ్‌ విలువ రూ. 53 కోట్లు ఉంటుంది. పాకిస్తాన్ పేద దేశం కాదు. పీవోజేకే, గిల్గిత్ బాల్టిస్తాన్‌లు కూడా పేదవేమీ కాదు. కానీ, మిలిటరీ, ముల్లా, ఫ్యూడల్ త్రయం కలిసికట్టుగా అక్కడి భూమినే కాదు.. మనుషుల మెదళ్లను తప్పుదారి పట్టించి ఉన్నారు.

Also Read: మరో సంచలన నివేదిక.. ఇండియా సహా 20 దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిన ఇజ్రాయెల్ సంస్థ! ‘కేంద్రం వాడుకుందా?’

బలోచ్, సింధి, పష్తూన్, పీవోజేకే, జీబీ ప్రజలు మిలిటరీ బ్యారెల్ గన్ నీడలో బ్రతుకుతున్నారు. వారు రాజకీయ, ఆర్థిక హక్కులేవీ స్వేచ్ఛగా అనుభవించలేకపోతున్నారు. 75 ఏళ్లుగా వాళ్ల బుర్రలోకి విద్వేషపు విషమే నింపుతున్నారు. అల్లా పాకిస్తాన్‌ను సృష్టించారని, హిందు భారత్ ఏ అవకాశం దొరికినా పాకిస్తాన్‌ను నాశనం చేస్తుందని నూరిపోస్తున్నారు.

జిన్నా ద్విజాతి సిద్ధాంతం, దుష్ప్రచారంతో ఇతర చిన్న చిన్న ప్రాంతాలను పాకిస్తాన్ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నది. కానీ, ఆ దుష్టత్రయం మాత్రం వీరిని దోచుకుంటున్నారు. కానీ, ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి.

బలోచ్, పష్తూన్‌లు ఆయుధాల చేబట్టుతున్నారు. పీవోజేకే, జీబీ ప్రజలు వీధుల్లోకి వచ్చి గళమెత్తుతున్నారు. 

ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం పూర్తిగా నాశనం అయ్యే దిశగానే వెళ్లుతున్నది. బలోచిస్తాన్, ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లను సోల్జర్లు వదిలిపెట్టి వెళ్లినట్టు చెబుతున్నారు. పాకిస్తాన్, పొరుగు దేశం అఫ్గనిస్తాన్ మధ్య కూడా వైరం పెరిగింది. పీవోజేకే, జీబీల్లో చైనా కూడా తన ప్రాజెక్టులు వదిలిపెడుతున్నది. పాకిస్తాన్ నుంచి పేమెంట్లు పెండింగ్‌లో ఉండటంతో ఒక్కో ప్రాజెక్టు విడిచిపెడుతున్నది.

1971 యుద్ధానికి ముందటి దుస్థితిలోకి రాజకీయ సంక్షోభం కూరుకుపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ అక్రమంగా నియంత్రిస్తున్న ప్రాంతాలు తమను తాము ఆ సంకెళ్ల నుంచి విడిపించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ, ఆ దేశాలు(భూభాగాలు!) పాకిస్తాన్ నుంచి తెగదెంపులు చేసుకోవడానికి అందరూ ఏకతాటి మీదికి వచ్చి సంయుక్తంగా నిలకడగా ముందడుగు వేయాలి.

రచయిత పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌లోని మీర్పుర్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త. ఆయన ప్రస్తుతం యూకేలో అజ్ఞాతంలో జీవిస్తున్నారు.

ఈ ఆర్టికల్ తొలుత ఆవాజ్ ది వాయిస్‌లో ప్రచురితమైంది. దీన్ని అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాం.