భారత్ సహా 20 దేశాల్లో 30కి పైగా ఎన్నికలను ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ ప్రభావితం చేసిందని తాజాగా ఓ సంచలన నివేదిక వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విదేశీ హ్యాకర్ల నెట్‌వర్క్‌ను వినియోగించిందా? అని అడిగింది.
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 దేశాల్లో 30 ఎన్నికలను ఒక ఇజ్రాయెలీ సంస్థ ప్రభావితం చేసినట్టు ఓ సంచలన నివేదిక వచ్చింది. బ్రిటన్‌కు చెందిన గార్డియన్, ఫ్రాన్స్‌కు చెందిన లెమండే సహా 30 మీడియా సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించిన ఓ అండర్‌కవర్ మీడియా ఇన్వెస్టిగేషన్ తాజాగా రిపోర్టును వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీ (టీమ్ జార్జ్ అని చెప్పుకుంటున్న కంపెనీ) తమ క్లయింట్ల కోసం 30కి పైగా ఎన్నికలను ప్రభావితం చేసింది. హ్యాకింగ్, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం వంటి టెక్నిక్‌లతో వీరు ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేసినట్టు ఈ రిపోర్టు తెలిపింది.
దీనిపై కాంగ్రెస్ రియాక్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మన దేశంలోనూ ఎన్నికలను ప్రభావితం చేయడానికి విదేశీ హ్యాకర్ల నెట్‌వర్క్‌ను బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకున్నదా? అని కాంగ్రెస్ అడిగింది. బీజేపీ, మోడీ ప్రభుత్వం ఈ హ్యాకర్లను మన దేశంలోని ఎన్నికల్లో కలుగజేసుకోవడానికి వినియోగించుకున్నదా? అని కాంగ్రెస్ మీడియా యూనిట్ హెడ్ పవన్ ఖేరా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడిగారు. ఆ ఇజ్రాయెలీ సంస్థను బీజేపీ ఐటీ సెల్‌తో పోల్చారు.కేంబ్రిడ్జ్ అనలిటికా, పెగాసెస్ వంటివాటి పేర్లను ఉటంకిస్తూ.. భారత రాజకీయ వ్యవస్థలో డిజిటల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఇజ్రాయెలీ కాంట్రాక్ట్ హ్యాకర్లను ఉపయోగించుకుందా? అని అడిగారు.
గత రెండు దశాబ్దాలుగా సుమారు 20 దేశాల్లో ఈ కంపెనీ తన సేవలు అందించినట్టు పేర్కొంది. ఇండియా సహా యూకే, యూఎస్, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్, యూఏఈల్లో జరిగిన ఎన్నికల్లో ఈ కంపెనీ పని చేసినట్టు ఎనిమిది నెలలపాటు ఇన్వెస్టిగేషన్ మీడియా బృందం ఆ రిపోర్టులో వివరించింది. అడ్వాన్స్‌డ్ ఇంపాక్ట్ మీడియా సొల్యూషన్స్(ఏఐఎంఎస్/ఎయిమ్స్) అనే సాఫ్ట్‌వేర్ ప్యాకేజీతో ట్విట్టర్, లింక్డ్ ఇన్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, జీమెయిల్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో వేలాది ఫేక్ ప్రొఫైల్స్‌ను కంట్రోల్ చేస్తున్నదని తెలిపింది.
తాల్ హనన్ అనే 50 ఏళ్ల మాజీ ఇజ్రయేలీ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేటివ్ ఈ కంపెనీని రన్ చేస్తున్నట్టు ఆ రిపోర్టు పేర్కొంది. అయితే, వారు మారుపేరు జార్జ్‌ను ఉపయోగిస్తున్నట్టు వివరించింది.
