మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా రాష్ట్రంలో కల్లోలం సృష్టించింది. చాలా మంది బీజేపీ నేతలు తమకు దక్కాల్సిన టికెట్లును కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి వచ్చిన వారికి లభించాయనే ఆగ్రహంతో రగిలిపోయారు. దీంతో బీజేపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. పీఎం మోడీ, సీఎం బీరెన్ సింగ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా ఆందోళనలు చేస్తూ నినాదాలు ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేతల రాజీనామాల పర్వం మొదలుపెట్టారు.

గువహతి: ఈశాన్య రాష్ట్రాల(North East States) రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. వచ్చే నెలలో జరగనున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఈశాన్య రాష్ట్రాల నుంచి మణిపూర్(Manipur) అసెంబ్లీకీ ఎన్నికలు జరుగనున్నాయి. మణిపూర్ అసెంబ్లీలో 60 సీట్లు ఉన్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను బీజేపీ(BJP) ఆదివారం ప్రకటించింది. ఈ అభ్యర్థుల జాబితా రాష్ట్రంలో అగ్గి మంటలు రేపింది. అల్లకల్లోలానికి కారణమైంది. బీజేపీ నేతలే, కార్యకర్తలే పార్టీపై బహిరంగంగా ఆందోళనలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా చాలా మంది పార్టీ నాయకులను నిరాశ పరిచింది. పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం ఎన్ బీరెన్ సింగ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఇంఫాల్‌లోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ చుట్టూ భద్రతను పెంచారు. ఈ జాబితాను చూసి చాలా మంది అసంతృప్తితో పార్టీకి రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ నుంచి పార్టీలోకి చేరిన నేతలకు టికెట్లు ఇచ్చి బీజేపీ నేతలనే పక్కనపెట్టడంతో వారిలో అసంతృప్తి జ్వాలలు రేగాయి. ఇలా కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చే ఆవశ్యకతపై టికెట్లు పొందలేకపోయిన బీజేపీ ఆశావహులు పార్టీ నుంచి బయటకు వచ్చే నిర్ణయాలు తీసుకుంటుున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీకి రాజీనామాల చేశారు. అయితే, ఎంత మంది రాజీనామా చేశారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ 60 మంది అభ్యర్థుల్లో కనీసం 10 మంది కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చింది. ఇది బీజేపీకి విశ్వాసంగా ఉన్న నేతల్లో మంటలు రేపుతున్నది.

సీఎం ఎన్ బీరెన్ సింగ్ సంప్రదాయకంగా తాను పోటీ చేసే హెయింగాంగ్ నుంచి పోటీ చేస్తున్నారు. మరో మంత్రి బిశ్వజిత్ సింగ్ తొంగ్జు సీటు నుంచి పోటీ చేయనున్నారు. కాగా, మాజీ నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ సొమతాయ్ సాయిజా ఉఖ్రుల్ నుంచి బరిలోకి దిగుతున్నారు.

మణిపూర్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 21 సీట్లను గెలుచుకుంది. మెజార్టీకి చాలా తక్కువగా సీట్లను గెలుచుకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు గెలిచిన 21 మందిలో 19 మందికి మళ్లీ బీజేపీ టికెట్లు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇద్దరికి టికెట్లు ఇవ్వలేదని వివరించాయి. 

ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన మణిపూర్ లో రెండు దశల్లో(ఫిబ్రవరి-27,మార్చి-3)అసెంబ్లీ ఎన్నికలు జరుగన్నాయి. మొదటి దశ ఎన్నికలకు ఫిబ్రవరి-1న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి-11 చివరి తేదీ. ఫిబ్రవరి-3న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి-16చివరి తేదీ. మార్చి-10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.