రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రక్షణ ఇవ్వడం సాధ్యం కాదని అల్లర్లు రేగిన హర్యానా రాష్ట్ర సీఎం మనోహన్ లాల్ ఖట్టార్ అన్నారు. ప్రజలే శాంతియుతంగా, సత్సంబంధాలతో మెలగాలని, అందరికీ పోలీసులు రక్షణ ఇవ్వలేరని వివరించారు. రెండు లక్షల మందికి 50 వేల మంది పోలీసులే ఉన్నారని పేర్కొన్నారు. 

న్యూఢిల్లీ: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ అల్లర్లకు దారి తీసిన సంగతి తెలిసిందే. సోమవారం మొదలైన ఈ అల్లర్లలో కనీసం ఆరుగురు మరణించారు. ఓ మసీదు, మరో ఆలయంపై దాడి జరిగింది. పదుల సంఖ్యలో క్షతగాత్రులున్నారు. నూహ్‌లో మొదలైన ఈ అల్లర్ల సెగలు ఢిల్లీ ఎన్సీఆర్‌లోని గురుగ్రామ్ వరకు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టారు బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పౌరులందరూ సంయమనం పాటించాలని, ఒకరిపట్ల మరొకరు స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం మనోహర్ లాల్ కట్టార్ అన్నారు. లేదంటే.. అందరికీ రక్షణ కల్పించడం అసాధ్యం అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఎదుటి పక్షం వారిని వ్యతిరేకిస్తూ ఉంటే భద్రతా అనేది సాధ్యపడదని చెప్పారు. పోలీసులకు, ఆర్మీకి, మీకు, మాకు కూడా ప్రతి ఒక్కరినీ రక్షించడం సాధ్యం కాదని అన్నారు.

Also Read: Farm Loan: రైతులకు రుణమాఫీపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే

అందరికీ భద్రత ఉండాలంటే ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం ఖట్టార్ అన్నారు. అక్కడ సంయమనం, సత్సంబంధాలు ఉండాలని చెప్పారు. ఇందుకోసమే పీస్ కమిటీలు ఉన్నాయని వివరించారు. ఒక వేళ అయినా సమస్యలు ఉన్నాయంటే అప్పుడు తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాము పీస్ మార్చ్‌లు చేశామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లండి పోలీసులు ప్రతి ఒక్కరినీ కాపాడలేరు అని అన్నారు. ఇక్కడ రెండు లక్షల మంది ఉంటే 50 వేల పోలీసులు మాత్రమే ఉన్నారని వివరించారు.