Prophet remark row: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా మండిపడ్డారు. సంఘ్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజలంతా ఏకమై మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు.
Prophet remark row: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక ప్రజాస్వామిక దేశంగా అందరూ ప్రశంసలు అందుకున్న భారత్‌ను సంఘ్ పరివార్ తన చర్యలతో ప్రపంచం ముందు సిగ్గు పడే స్థితికి తీసుకొచ్చిందన్నారు. ఇలాంటి చర్యలతో దేశ సామాజిక భద్రత, ఆర్థిక సుస్థిరతను ప్రమాదంలో పడే అవకాశమున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్వేష వాదులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
లక్షలాది మంది భారతీయులకు ఉపాధి కల్పిస్తూ.. ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి తోడ్పడుతున్నాయని, కీలకమైన సహకారాలను అరబ్ దేశాలు అందిస్తున్నాయని, కానీ, ఆ దేశాలు ఇప్పుడు వ్యతిరేకంగా గళం విప్పాయని, ఆయా దేశాలు ఇప్పుడు బీజేపీ, సంఘ్ పరివార్ విద్వేష రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.
హిందుత్వ మత రాజకీయాలు ముస్లింలను అణిచివేస్తున్నాయని, మరొక మతం యొక్క విశ్వాసాలు, సంస్కృతిని అవమానించడం, తిరస్కరించే హక్కు ఎవరికీ లేదని, ఏ ఒక్కరికి భారత రాజ్యాంగం కల్పించలేదని సీఎం విజయన్ స్పష్టం చేశారు. దేశ లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించి విద్వేషం వ్యాప్తి చేసే వారిపై, అలాగే.. దేశ భద్రతకు, సమగ్రతకు భంగం కలిగించే శక్తులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని కోరారు.
ప్రస్తుతం మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆ వ్యాఖ్యలపై వివాదం చెలారేగుతోంది. తొలుత ఇస్లామిక్ దేశాలు.. అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనంతరం బీజేపీ వ్యాఖ్యలకు నిరసనగా కువైట్, ఖతార్, ఇరాన్ దేశాలు భారత రాయబారులకు సమన్లు జారీ చేశాయి. ఆ తర్వాత ఇదే బాటలో సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేసియా తదితర ఇస్లామిక్ దేశాలు చేరాయి. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అలాగే.. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించాయి.
మన పొరుగు దేశాలైన ఇండోనేసియా, మాల్దీవులు సైతం నిరసన వ్యక్తం చేశాయి. బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించాయి.భారత ప్రభుత్వం, బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించాయి. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రెసిడెంట్ ఇబ్రహీం సోలీ ఖండించాలని.. మాల్దీవుల పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష ఎంపీ అహ్మద్ షరీఫ్ ప్రయత్నించగా.. ఆ తీర్మానాన్ని పార్లమెంట్ తిరస్కరించింది.
ఈ క్రమంలో బీజేపీ నేతలను హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఆరేళ్ల పాటు నూపుర్ శర్మను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆమెతో పాటు నవీన్‌జిందాల్ ను ప్రాథమిక సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. అనంతరం నూపుర్ శర్మ తన ట్విట్టర్ వేదికగా.. క్షమాపణలు కోరింది. "నా మాటలు ఎవరికైనా అసౌకర్యం కలిగించినా లేదా మతపరమైన భావాలను గాయపరిచినా, బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించు కుంటున్నాను. ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు." అని ట్వీట్ లో రాసుకొచ్చింది.
