Prophet remark row: బీజేపీ సిగ్గుమాలిన మతోన్మాదం భారతదేశాన్ని ఏకాకిని చేయడమే కాకుండా, దాని ప్రపంచ స్థాయిని కూడా దెబ్బతీసిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
Prophet remark row: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధులు మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆరబ్ దేశాలు భారత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు దేశాల్లో భారత్ ప్రోడక్టుల అమ్మకాలపై నిషేధం విధించే స్థాయికి పరిస్థితులు చేరాయి. బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి స్పందిస్తూ.. బీజేపీ నాయకులతో పాటు కేంద్రం ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. బీజేపీ సిగ్గుమాలిన మతోన్మాదం భారతదేశాన్ని ఏకాకిని చేయడమే కాకుండా, దాని ప్రపంచ స్థాయిని కూడా దెబ్బతీసిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
'అంతర్గతంగా విడిపోయిన భారత్ బాహ్యంగా బలహీనంగా మారుతోంది. బీజేపీ అవమానకరమైన మతోన్మాదం మనల్ని ఒంటరిగా చేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీసింది' అని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇస్లాం స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అరబ్ ప్రపంచం ఖండిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్, యూఏఈ, ఇరాన్ వంటి గల్ఫ్ దేశాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. ఖతార్, కువైట్ భారతదేశం నుండి బహిరంగ క్షమాపణలు కోరుతున్నాయని చెప్పారు.
అంతకుముందు, ద్వేషం ద్వేషాన్ని మాత్రమే పెంచుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రేమ, సౌభ్రాతృత్వ మార్గాలు మాత్రమే దేశాన్ని పురోభివృద్ధి దిశగా తీసుకెళ్లగలవని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని ఏకం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
గత కొంత కాలంగా దేశంలో హిందూ-ముస్లి వర్గాల నేపథ్యంలో రాజకీయాలు మరింతగా నడుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న జ్ఞాన్‌వాపి మసీదు వివాదంపై టీవీ చర్చ సందర్భంగా ముస్లిం వర్గాలపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. సర్వత్రా ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం కావడంతో బీజేపీ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంది. అలాగే, బీజేపీ నుంచి ఆమెను పార్టీ పదవి నుంచి సస్పెండ్ చేసింది. “ఏదైనా వర్గాన్ని లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే ఏ భావజాలానికి కూడా బీజేపీ వ్యతిరేకం. అలాంటి వ్యక్తులను లేదా తత్వాన్ని బీజేపీ ప్రోత్సహించదు’’ అని ఈ సందర్భంగా ఆ పార్టీ పేర్కొంది. అలాగే, మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద ట్వీట్ చేసినందుకు నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించింది.
