చంద్రయాన్ -3 విజయవంతం కావడం పట్ల ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.వీరముత్తువేల్ తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం తన కుమారుడు చాలా కష్టపడ్డాడని తెలిపారు. కొన్ని సార్లు ఇంటికి కూడా రాలేదని గుర్తు చేసుకున్నారు.

చంద్రయాన్ -3 మిషన్ సక్సెస్ అయ్యింది. ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై మొదటి సారిగా కాలుమోపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇస్రోకు పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగిపోయింది. అయితే ఇంతటి విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్. భారత్ మూన్ మిషన్ విజయం సాధించడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అయితే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన తరువాత ఓ వైపు దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటుంటే.. ఓ వ్యక్తి కూడా ఒంటరిగా ఆనంద భాష్పాలు రాల్చారు. 

ఆయన ఎవరో కాదు చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్ తండ్రి పి.పళనివేల్. ఈ మిషన్ కోసం తన కుమారుడు పడిన కష్టాన్ని ఆయన దగ్గరుండి చూశారు. ఈ మిషన్ కోసం కుమారుడు నెలల తరబడి ఇంటికి రాలేదని గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్ -3 విజయవంతం అయిన నేపథ్యంలో తమిళనాడులో ఉంటున్న పి.పళనివేల్ ఇంటికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయనకు అభినందనలు తెలిపారు. దీంతో పి.పళనివేల్ భావోద్వేగానికి గురయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు చాలా కష్టపడ్డాడు. ఈ రోజు చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయింది. కాబట్టి ఈ ఆనందం భారతదేశంతో పాటు తమిళనాడులోని ప్రతి ఒక్కరికీ చెందుతుంది. చంద్రయాన్ -3 ప్రాజెక్టు డైరెక్టర్ తండ్రిగా నాకు మరింత ఆనందంగా ఉంది. ’’ అని అన్నారు. 

చంద్రయాన్ 3 ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ను నేను సందర్శించాను. దీంతో అక్కడున్న సీనియర్ సైంటిస్టులు నన్ను అభినందించారు. నాతో ఫొటోలకు దిగారు. మిషన్ గురించి నా కుమారుడు ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ అతడు చాలా కష్టపడ్డాడు. కొన్నిసార్లు మమ్మల్ని కలవడానికి కూడా వచ్చేవాడు కాదు’’ అని తెలిపారు. 

పి.వీరముత్తువేల్ నేపథ్యం 
చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్ ఓ మాజీ రైల్వే ఉద్యోగి కుమారుడు. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన.. మద్రాస్ ఐఐటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని, ఇస్రోలో చేరాలని పి.వీరముత్తువేల్ కలలు కన్నారు. తరువాత దానిని సాధ్యం చేసుకున్నారు.